‘వర్దా’ బీభత్సం..

259
vardha
- Advertisement -

తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో తీరం దాటిన వార్దా తుపాను పెను బీభత్సం సృష్టిస్తోంది. 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులు చెన్నై నగరాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. భారీ తుపానుకు తోడు ఊదురు గాలులతో నగరమంతా చిగురుటాకులా వణికిపోతోంది. ఈదురు గాలులకు భవనాలు గాలిలో ఊగిపోతున్నాయి. పెద్దపెద్ద మహావృక్షాలు సైతం కూకటివేళ్లతో నేలమట్టమవుతున్నాయి. హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలుతున్నాయి. వేగంగా వీస్తున్న గాలి తాకిడికి కార్లు సైతం కొట్టుకుపోతున్నాయి భారీ వర్షాలతో ఇప్పటివరకు చెన్నైలో ఇద్దరు చనిపోయినట్టు సమాచారం. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.

vardha

వార్దా దాటికి చెన్నై నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం 6 గంటల కల్లా చెన్నైని తుపాను వీడనుందని అధికారుల సమాచారం. సాయంత్రం వరకు ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలకు తోడు..గాలులతో రవాణా వ్యవస్థ స్తంభించింది. చెన్నై విమానాశ్రయంలో సాయంత్రం 6 గంటలకు రాకపోకలు నిలిపివేశారు. చెన్నైలో సబర్బన్‌ రైళ్లు రద్దు. చెన్నై విమానాలు హైదరాబాద్‌, బెంగళూరుకు మళ్లించారు.

vardha

ఆంధ్రప్రదేశ్‌ లోని కోస్తా తీర ప్రాంతాల్లో వర్దా తుపాను ప్రభావం బాగానే ఉంది. నెల్లూరు, ప్రకాశంతో పాటు చిత్తూరు జిల్లాలో తుపాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి కొన్ని ప్రాంతాలు జలమయమైయ్యాయి. బలంగా వీచిన ఊదురుగాలులకు..భవనాలు..విద్యుత్ స్తంభాలు..వృక్షాలు నెలకులాయి. అయితే రేపటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు చేరవేస్తున్నామని తెలిపారు. నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటలో ఈదురుగాలుల తాకిడికి ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ మార్గంలో వాహనాలను నిలిపివేశారు.

vardha

మరోవైపు వర్దా ఎఫెక్ట్‌తో తిరుమల, తిరుపతిలోనూ భారీ వర్షం కురుస్తోంది. చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయం కూడా వార్థా బాధితురాలిగా మారింది. వార్థా ధాటికి వీస్తున్న గాలుల కారణంగా విమానాశ్రయంలోని పైకప్పుకు చిల్లుపడింది. భీకరమైన గాలులకు తోడు వర్షం కూడా ధారగా కురుస్తుండడంతో విమానాశ్రయం మొత్తం నీటితో నిండిపోయింది. దీంతో విమానాశ్రయం మూసివేశారు. ఇక్కడికి రావాల్సిన విమానాలను హైదరాబాదుకు దారి మళ్లీంచారు.

vardha

- Advertisement -