సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జంపింగ్ జపాంగ్‌లో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. టీడీపీ నుండి వైసీపీకి,వైసీపీ నుండి టీడీపీలోకి ఎమ్మెల్యేలు వలస బాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలె వైసీపీని వీడిన వంగవీటి రంగ వారసుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో భేటీ అయిన రాధాకృష్ణ తనను ఇబ్బందిపెట్టిన వైసీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. బహిరంగంగా జగన్ ఓటమే తన లక్ష్యమని ప్రకటించిన ఆయన టీడీపీ నేతలు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని అనుచరులు, సన్నిహితులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుండి వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన రాధాకృష్ణ ఈసారి ఎంపీగా పోటీచేసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. అనకాపల్లి, ఉభయగోదావరి జిల్లాలలో ఏదో ఒక చోట నుండి ఎంపీగా పోటీ చేయాలని రాధ భావిస్తున్నట్లు సమాచారం. .
ఇక మరోవైపు రాజకీయాలకు స్వస్తిచెప్పిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి చాపకిందనీరులా ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో సన్నిహితులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులో స్పీకర్ కోడెలతో చర్చలు జరిపిన లగడపాటి తాజాగా రాధతో భేటీకావడం ప్రాధాన్యతసంతరించుకుంది.