తాజ్ మహల్ టీ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది.. తబలా పారవశ్యంతో వాయిస్తున్న ఉస్తాద్ జాకీర్ హుస్సేన్. వాహ్ తాజ్ అంటూ ఆయన చేసిన టీవి యాడ్స్.. అమ్మకాల్లో తాజ్ మహల్ టీ ని అగ్రస్థానంలో ఉంచాయి. ముందు జీనత్ అమన్ లాంటి ఒకరిద్దరు ఈ టీ ని ప్రమోట్ చేసినా ఊపందుకోలేదు. యీ ఉస్తాద్ ఎంట్రీ తో టీ జాతకమే మారిపోయింది. తబలాపై తాను సృష్టించిన మధుర ధ్వనులు సంగీత ప్రియులను శ్రోతలను ఓలలాడించాయి. ప్రపంచ స్థాయిలో కీర్తిప్రతిష్టలు అందుకున్న తబలా ఎక్స్ పోనెంట్ 73 సంవత్సరాల జాకీర్ హుస్సేన్ మరణ వార్త (నాలుగు రోజులు క్రితం) యావత్ సంగీత ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది.
తన తండ్రి అల్లా రఖా ని మించిన తనయుడుగా తబల వాద్యంలో జాకీర్ హుస్సేన్ గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఈయన తన పేరుతో కాకుండా తన ప్రతిభతోనే పరిచయమై సెలిబ్రటీ అయ్యారు. నాలుగు గ్రామీ, మూడు పద్మాలతో పాటు అనేక ప్రిస్టీజియస్ అవార్డులు అందుకున్నారు. ఈ సంవత్సరం 2024 లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి మూడు ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడు గా చరిత్ర కెక్కారు జాకీర్ హుస్సేన్. ఆరు దశాబ్దాల పాటు సాగిన ఈ తబలా సంగీత ప్రయాణంలో ఎంతోమంది అంతర్జాతీయుల కళాకారులతో కూడా కలిసి పనిచేసిన అనుభవం ఈయనది. ఎంత పేరు వచ్చినా, ఎన్ని అవార్డులు వచ్చినా ఒదిగి ఉండే మనస్తత్వం గల సెలిబ్రెటీలలో జాకీర్ హుస్సేన్ ముందు వరుసలో ఉంటారు.
మనల్ని మనం బెస్ట్ అనుకోకూడదు అని తన తండ్రి చెప్పిన మాటే తనని ఈ స్థాయికి చేర్చిందని చెబుతుండే వారు. తాజ్ మహల్ టీ యాడ్స్ లలో ఈయన ఉపయోగించిన.. వాహ్ తాజ్.. ఎంతలా జనాల్లో చొచ్చుకు పోయిందంటే.. ఒక ఊతపదంగా,ఒక బజ్ వర్డ్ గా మారిపోయింది. మన ఇళ్ళల్లో కూడా పిల్లలు ఏదైనా ఘనకార్యం చేస్తే.. వాహ్ శ్రీను, వాహ్ సరళ, వాహ్ తేజా.. అనడం పరిపాటి అయింది. వాహ్ తాజ్, పాన్ పరాగ్ ప్రకటనలు ప్రేక్షకులను మైకంలో పడేశాయి. తబలా వాయిద్యంలో అనేక వినూత్న రీతిలో ప్రయోగాలు చేశారు జాకీర్ హుస్సేన్. కొన్ని హిందీ సినిమా పాటలకి ఈయన అందించిన తబలా సహకారం.. వాహ్.. అనిపించేలా చేసింది. ఈయన బొంబాయిలోనే పుట్టి పెరగడం, ఈయన తండ్రి కూడా గొప్ప తబలా విద్వాంసుడు కావడంతో తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకుని తబలా వాయిద్యానికి మరింత గౌరవం తెచ్చిపెట్టిన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఊహించని మరణం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గత రెండు వారాలుగా అమెరికా సాన్ ఫ్రాంసిస్ కో లో చికిత్స పొందుతూ మరణించారు. ఇంతలా పేరు తెచ్చుకున్న మరో తబల విద్వాంసుడు దొరుకుతాడన్న నమ్మకం లేదు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా తబలా స్వరాలు మన హృదయాలలో మోగుతునే ఉంటాయి.
Also Read:ప్రజాకవి కాళోజీ..బయోపిక్ రిలీజ్ డేట్!