క్రికెట్‌కు ఆసీస్ క్రికెటర్‌ గుడ్‌ బై

6
- Advertisement -

ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో, చివరి యాషెస్ టెస్టు మ్యాచ్ అనంతరం ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతారని వెల్లడించాడు. ఈ మ్యాచ్ సిడ్నీలో జరగనుండగా, ఇదే మైదానంలో 2011లో ఖవాజా తన టెస్ట్ అరంగేట్రం చేయడం విశేషం. మొత్తం 88 టెస్టులు ఆడిన తర్వాత అదే వేదికపై తన కెరీర్‌కు ముగింపు పలకనున్నాడు.

ప్రస్తుతం వరకు ఖవాజా ఆస్ట్రేలియా తరఫున 87 టెస్టులు ఆడి 6206 పరుగులు సాధించాడు. సగటు 43.39తో పాటు 16 శతకాలు, 28 అర్ధశతకాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. జనవరి 4 నుంచి ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టుకు ముందు తన నిర్ణయాన్ని వెల్లడించారు.

కొంతకాలంగా ఈ విషయంపై ఆలోచిస్తున్నాను. ఈ సిరీస్‌నే నా చివరి సిరీస్‌గా భావించాను అని ఖవాజా తెలిపాడు. అయితే, ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ మాత్రం 2027లో జరిగే భారత పర్యటన వరకు ఆయన కొనసాగాలని కోరుకున్నట్లు చెప్పారు. కానీ అడిలైడ్ టెస్టుకు తొలుత ఎంపిక కాకపోవడం తనకు ఒక సంకేతంగా అనిపించిందని ఖవాజా పేర్కొన్నాడు. చివరి నిమిషంలో స్టీవ్ స్మిత్ అనారోగ్యంతో తప్పుకోవడంతో తాను ఆ మ్యాచ్ ఆడినట్లు గుర్తుచేశాడు.

తన భార్య రాచెల్‌తో ఈ నిర్ణయంపై చర్చించినట్లు, గౌరవంగా తనకు ఇష్టమైన ఎస్‌సీజీలోనే వీడ్కోలు తీసుకోవడం సంతోషంగా ఉందని ఖవాజా అన్నారు. గత వేసవిలో భారత్‌తో జరిగిన సిరీస్ సమయంలో, అలాగే బాక్సింగ్ డే టెస్టు తర్వాత కూడా రిటైర్మెంట్‌పై ఆలోచించినట్లు వెల్లడించాడు. అయితే జట్టు అవసరాల కోసమే తాను కొనసాగినట్లు స్పష్టం చేశాడు.

Also Read:పోలీసుల అదుపులో మావోయిస్టు దేవా!

 

- Advertisement -