ఓటు హక్కు వినియోగించుకోండి..

210
vote
- Advertisement -

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం భారతదేశం. అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ వంటిది. ఎన్నికల నీతివంతంగా, అత్యంత పారదర్శకంగా జరగడం కోసం ఎన్నో నియమాలు, సూత్రాలు పొందుపరిచాయి.

ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా కొనసాగించడంలో పౌరసమాజం పాత్ర గణనీయమైనది. వయోజనుడు కేవలం ఓటరు మాత్రమే కాక పౌరుడు కూడా. ఓటరుగా తన ఓటు హక్కును నిష్పాక్షికంగా నిర్భయంగా వినియోగించుకోవడం ఎంత అవసరమో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేందుకు సహకరించడం కూడా అంతే అవసరం.

ఓటు హక్కు సిద్ధించిన ప్రజాస్వామికదేశాల్లో కూడా చాలాకాలం పాటు పారదర్శక ఓటు హక్కు అంటే కేవలం పురుషుల ఓటు హక్కు. కొన్ని దేశాల్లో ఓటు హక్కు ధనికులకు మాత్రమే పరిమితమైన అవకాశం. కానీ భారత రాజ్యాంగం జాతి, మతం, కులం, భాష, లింగం వంటి ప్రాతిపదికలతో నిమిత్తం లేకుండా భారత పౌరులందరికీ ఓటు హక్కు కల్పించింది.

18 ఏళ్ళ వయసుకు తక్కువ కాని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు భారత లోక్‌సభకు , రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 1950 నుండి భారతదేశంలో అమలులోకి వచ్చిన సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఎంతో విప్లవాత్మకమైన చర్య. భారతదేశంలో సార్వత్రిక ఓటు హక్కును ప్రవేశపెట్టే నాటికి గ్రీసు, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కొన్ని కొన్ని వర్గాల వారికి ఓటు హక్కు అందలేదంటే భారత రాజ్యాంగం చూపించిన రాజకీయ పరిణతి ఎంత ప్రశంస నీయమో తెలుస్తుంది. చాలా దేశాల్లో ప్రజలందరికీ వారికి నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకుని ఏర్పాటు చేసుకునే హక్కు ఇంకా సిధ్ధించనే లేదు.

నిర్భయంగా ప్రశాంతంగా ఏకాంతంగా ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటు వేయడానికి హక్కు అంటే పౌరుడు తనకు నచ్చిన అభ్యర్ధిని ఎన్నికల్లో గెలిపించడానికి ఓటు వేయడం ద్వారా ప్రభుత్వ నిర్మాణంలో భాగం పంచుకోవడం అని అర్ధం. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి ఎవరికి ఓటు వేశామో తెలుసుకునేలా ప్రింట్ స్లిప్‌ను కూడా ఇస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు ..అందుకే దేశ ప్రగతికి ఉపయోగపడేలా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

- Advertisement -