అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి అంతర్జాతీయంగా కలకలం రేపారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రస్తుతం అమెరికా అదుపులో ఉన్నారని ట్రంప్ ప్రకటించారు. మదురోతో పాటు ఆయన భార్యను కూడా అమెరికాకు తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
వెనెజులాపై అమెరికా భీకర దాడులు నిర్వహించినట్లు ట్రంప్ వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వెనెజులా ప్రధాన కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు. మదురో ప్రభుత్వమే డ్రగ్ కార్టెళ్లకు రక్షణ కల్పిస్తోందని, ఈ అక్రమ కార్యకలాపాలు అమెరికా భద్రతకు ముప్పుగా మారాయని ట్రంప్ అన్నారు. అందుకే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన సమర్థించుకున్నారు.
అమెరికా జాతీయ ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వ్యాపారం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే నాయకులపై ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై వెనెజులా ప్రభుత్వం ఇంకా అధికారిక స్పందన ఇవ్వలేదు. ఈ పరిణామాలు లాటిన్ అమెరికా రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమాధికారంపై ఈ ప్రకటనలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read;ఆస్ట్రేలియాలో యూట్యూబర్ అన్వేష్‌పై ఫిర్యాదు

