మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు కొనసాగిస్తున్న దాడులు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. రోజురోజుకు యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతూ ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా ఇరాన్‌లోని కీలక సైనిక, వ్యూహాత్మక కేంద్రాలపై వైమానిక దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా టెహ్రాన్ నగరంలోని ప్రధాన చమురు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ క్షిపణులు దాడి చేసినట్లు విదేశీ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడులతో అక్కడ భారీ అగ్నిప్రమాదాలు సంభవించినట్లు తెలుస్తోంది.
దీనికి ప్రతిదాడిగా ఇరాన్ కూడా వెనుకడుగు వేయకుండా స్పందిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సైనిక స్థావరాలు మరియు వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది.
ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు పశ్చిమాన ఉన్న ఎయిర్ డిఫెన్స్ కమాండ్ సెంటర్‌ను కూడా ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఘటనలతో ఇరాన్ రక్షణ వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:ఇంట్రెస్టింగ్‌గా విక్రమ్ ఆన్ డ్యూటీ!
మొత్తంగా చూస్తే మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మరింత విషమంగా మారుతున్నాయి. ఈ యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

