అమెరికా–ఇజ్రాయెల్ కూటమి మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న ప్రత్యక్ష సైనిక ఘర్షణ బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటివరకు ఇరాన్‌లో కనీసం 787 మంది మృతి చెందినట్లు సమాచారం. లెబనాన్‌లో దాదాపు 60 మంది, ఇజ్రాయెల్‌లో సుమారు పన్నెండు మంది, అలాగే ఆరుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్‌పై మరిన్ని వైమానిక దాడులు ప్రారంభించింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై, ముఖ్యంగా బెరూట్ నగరం పరిసరాల్లో ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలపై కౌంటర్ దాడులు కొనసాగిస్తోంది. పశ్చిమ ఆసియా దేశాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు సమాచారం.
మధ్యప్రాచ్య ఘర్షణలో కీలక పరిణామంగా, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి ఖతార్‌లోని అల్ ఉడైద్ అమెరికా వైమానిక స్థావరాన్ని తాకినట్లు బీబీసీ నివేదిక పేర్కొంది. ఈ స్థావరం ప్రాంతంలో అతిపెద్ద అమెరికా సైనిక కేంద్రంగా ఉంది. రెండో క్షిపణిని వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్ అధికారులు తెలిపారు.
ఇక ఇరాన్‌కు చెందిన ఓ నౌక నుంచి వచ్చిన అత్యవసర సహాయ సంకేతం మేరకు శ్రీలంక సైన్యం కనీసం 30 మందిని రక్షించింది అని శ్రీలంక విదేశాంగ మంత్రి వెల్లడించారు.
Also Read:TTD:15న పుష్పయాగ మహోత్సవం
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎవరిని ఎంపిక చేసినా, ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనే యత్నం కొనసాగిస్తే అతడు “లక్ష్యంగా మారతాడు” అని ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. అమెరికా, స్వేచ్ఛా ప్రపంచ దేశాలను బెదిరించే నాయకత్వాన్ని సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

