పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు అనిశ్చితిలో పడ్డాయి. అమెరికా ప్రతినిధి బృందంతో నేరుగా భేటీ అయ్యేందుకు ఇరాన్ ఇంకా సిద్ధంగా లేదని సమాచారం. దీంతో ఈ చర్చల ప్రక్రియ అటకెక్కినట్లే కనిపిస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి.
మొండికేస్తున్న ఇరాన్: పాకిస్థాన్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం, రెండో విడత చర్చల పునరుద్ధరణపై సందిగ్ధత నెలకొంది. అమెరికా బృందాన్ని కలిసేందుకు టెహ్రాన్ విముఖత చూపుతోంది.
చర్చలు ప్రారంభించాలంటే అమెరికా ముందుగా ఒక నిబంధనను నెరవేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద తమ ఓడరేవులపై అమెరికా విధిస్తున్న నౌకా దళ దిగ్బంధనాన్ని (Naval Blockade) వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది.
వేచి చూస్తున్న అమెరికా బృందం: అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఇరాన్ వైపు నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఈ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఈ చర్చల దృష్ట్యా ఇస్లామాబాద్ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెడ్ జోన్ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన రహదారులను మూసివేసి నిఘాను కట్టుదిట్టం చేశారు.
Also Read:కవిత మాటలను ఉపసంహరించుకోవాలి
అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మరియు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మధ్య జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి.ప్రస్తుతానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇస్లామాబాద్‌లో ఉన్నప్పటికీ, అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు ఆయన ప్రభుత్వం మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ఈ డెడ్‌లాక్ ఎప్పుడు వీడుతుందోనని అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.

