ఊర్మిళ…ఈ పేరు వింటే రంగేళి సినిమా గుర్తుకొస్తోంది. ఆర్జీవీ-ఊర్మిళ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ ఎవర్‌గ్రీన్ సినిమాల జాబితాలో చోటుసంపాదించుకుంది. ఇ క ఈ సినిమాలో ఊర్మిళ వేసుకున్న పొట్ట డ్రస్సులకు యమ క్రేజ్ వచ్చింది. 2016లో పెళ్లిచేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ బ్యూటీ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతోంది.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఊర్మిళ రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో ముంబయి ఈస్ట్ నుంచి బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.ప్రస్తుతం స్ధానం నుండి బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీని ఓడించేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్ ఇందుకోసం సినీ గ్లామర్ ఉన్న ఊర్మిళను బరిలో దించనున్నట్లు టాక్.
1989 నుండి 2004 వరకు ఈ నియోజకవర్గంలో బీజేపీకి తిరుగులేదు. బీజేపీ నేత రామ్ నాయక్ వరుసగా గెలుస్తూ వచ్చారు. రామ్ నాయక్ కు విజయాలకు బ్రేక్ వేశారు బాలీవుడ్ నటుడు,కాంగ్రెస్ అభ్యర్థి గోవిందా గట్టి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో సంజయ్ నిరుపమ్‌పై బీజేపీ నేత గోపాల్ శెట్టి భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఈ నియోజకవర్గంపై కమలం పార్టీ మళ్లీ పట్టు పొందగలిగింది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీకి షాక్ ఇచ్చేందుకు మళ్లీ సినీ నటిని రంగంలోకి దింపడం ద్వారా పార్టీకి లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.