ఉప్పల్ టెస్ట్ మ్యాచ్‌..సీపీ రివ్యూ

20
- Advertisement -

జనవరి 25 నుండి 29 వ తేదీల మధ్య ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్, డిసిపి మల్కాజ్ గిరి పద్మజ ఐపిఎస్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో ఉప్పల్ స్టేడియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సీపీ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ఉప్పల్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణ ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశం అని, తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టికెట్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని , హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ధరలు నిబంధనల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని HCA అధికారులను ఆదేశించారు.

స్టేడియం పరిసరాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతాయని పేర్కొన్నారు. పాసుల జారీలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. నకిలీ టికెట్లు అమ్మేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్, HCA సెక్రెటరీ దేవరాజు డిసిపి మల్కాజ్ గిరి పద్మజ ఐపిఎస్, అడ్మిన్ డీసీపీ ఇందిర, ఎస్బి డీసీపీ కరుణాకర్, ట్రాఫిక్ డీసీపీ మల్కాజిగిరి అదనపులు డీసీపీ వెంకట రమణ, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:NBK:కన్నుల పండుగలా ‘హనుమాన్‌’

- Advertisement -