హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్‌కి సర్వం సిద్దమైంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇరుజట్లు తలో మ్యాచ్‌లో గెలుపొందగా రేపు జరిగే మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంద. ఇప్పటికే రెండు దేశాల క్రికెట్ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. దీనికి కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షం కురిసినా రెండు గంటల్లో గ్రౌండ్‌ని క్లియర్ చేసే విధంగా హెచ్‌సీఏ ఏర్పాట్లు చేసింది. సెక్యూరిటీ వింగ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ కంట్రోల్ పార్టీ, విజిలెన్స్, ఆక్టోపస్ తో కలిపి మొత్తం 1800 మంది పోలీసులతో సెక్యురిటీ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.
ఆటకు ముందు అంటే స్టేడియంలోకి సాయంత్రం నాలుగు గంటల తర్వాతనే స్టేడియం గేట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. భద్రతలో భాగంగా స్టేడియం మొత్తం 56 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 9 వేలకు పైగా వాహనాలు స్టేడియం వద్దకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కారులో వచ్చేవారు రామంతపూర్ వైపు ఉండే ఎల్జీ గౌడౌన్ వద్ద పార్క్ చేసి… గేట్ 1, 2 ద్వారా లోపలకు వెళ్లాలని సూచించారు.
కాగా ఈ మ్యాచ్ కు ఊహించని అతిథి రాబోతున్నాడు. అతనెవరో కాదు బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్. ఈ మ్యాచ్ ను చూడ్డానికి రావాల్సిందిగా అమీర్ ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరీ మరీ కోరాడట. ఓ టీవీకి సంబంధించి దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ ను చూడ్డానికి తప్పకుండా రావాలంటూ అమీర్ ను కోహ్లీ కోరాడు. క్రికెట్ టీమ్ బసచేస్తున్న హోటల్లోనే అమీర్ కు కూడా ఏర్పాట్లు జరిగినట్టు సమాచారం. మరో విషయం ఏమిటంటే… టీవీ షో సందర్భంగా అమీర్ కు విరాట్ కోహ్లీ ఓ జెర్సీని బహూకరించాడు. ఈ జెర్సీని ధరించే అమీర్ ఖాన్ మ్యాచ్ ను చూడనున్నట్టు తెలుస్తోంది.