జనవరి 1 అంటే అందరికీ ప్రత్యేకమే. అందుకే మన టాలీవుడ్ తారలు ఆరోజు వారి సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్, పోస్టర్స్‌లను విడుదల చేస్తుంటారు. మరి ఈ జనవరి 1న కూడా ఫస్ట్‌లుక్కులు వరుస కట్టాయి. అల్లుఅర్జున్, అనుష్క, విష్ణు, రానా చిత్రాలకు సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చాయి. అల్లు అర్జున్ అంటే హుషారైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్. తెరపై తన జోరునే చూశాం ఇప్పటి వరకు. కానీ బన్నీ కోపం ఎలా ఉంటుందో ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ టీజర్ చూపిస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్‌ని జనవరి 1న విడుదల చేశారు.
మిలటరి దుస్తుల్లో బన్నీ చాలా స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. కండలు తిరిగిన దేహం, తీక్షణమైన చూపులతో ఆకట్టుకున్నాడు. బన్నీని చూపించిన దాదాపు అన్ని ఫ్రేముల్లోనూ ఆ పాత్ర తాలుకూ కోపం కనిపించింది. ‘ఇలాగైతే కొన్ని రోజులకు చచ్చిపోతావ్‌రా’ అంటూ రావు రమేష్ అంటే ‘చచ్చిపోతాను గాడ్ ఫాదర్.. కానీ ఇక్కడ కాదు బోర్డర్’లో అంటూ బన్నీ సమాధానం ఇవ్వడం చూస్తుంటే ఇది దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. ఏప్రిల్‌లో ‘నా పేరు సూర్య’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
అనుష్క ‘భాగమతి’గా సిద్ధం అవుతోంది. అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది వరకే తనకు తానే శిలువ వేసుకుంటున్న ‘భాగమతి’ రూపాన్ని బయటకు వదిలింది చిత్రబృందం. అందులో అనుష్క మోముని పూర్తి స్థాయిలో చూపించలేదు. అయితే ఈసారి.. ‘భాగమతి’గా ఆమె ఎలా ఉంటుందో పూర్తి స్థాయిలో చూపించింది చిత్రబృందం. జుత్తు విరబూసుకుని, దేనికోసమో అన్వేషిస్తున్నట్టున్న అనుష్క చిత్రాన్ని 2018 తొలి రోజున విడుదల చేశారు. ఈ వారంలోనే ట్రైలర్‌ని ఆవిష్కరించనున్నారు.
‘గాయత్రి’ మూవీ నుండి విష్ణు,శ్రియల లుక్ కాస్త విభిన్నంగా బయటకు వచ్చింది. నోట్లో దువ్వెన పెట్టుకొని, శ్రియకు శ్రద్దగా జడ అల్లుతూ.. కనిపించారు విష్ణు. ‘ఇకపై ఇద్దరిదీ ఒకే ప్రాణం’ అనే క్యాప్షన్ జోడించారు. ఇదో కుటుంబతరహా చిత్రమని లుక్ చూడగానే అర్థమైపోయింది. మోహన్‌బాబు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘గాయత్రి’. అందులో విష్ణు, శ్రియలు ఆలుమగలుగా కనిపించనున్నారు. మదన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
‘బాహుబలి’కి ముందే రానా జాతీయ స్థాయి నటుడు. ‘ఘాజీ’ హిందీలోనూ బాగానే ఆడింది. తమిళ, మలయాళ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న ‘హథీ మేరే సాథీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఏనుగుల నేపథ్యంలో సాగే కథ ఇది. దానికి తగ్గట్టుగానే ఏనుగుతో కలసిన రానా చిత్రాన్ని ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కాబోతోంది. దీనికి ‘అడవి రాముడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.