మలయాళ హీరోయిన్ భావన జీవితంలో కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన సౌత్ సినీ పరిశ్రమ మొత్తాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. భావన మాజీ డ్రైవర్ మరికొందరితో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ అసభ్యంగా లైంగిక వేధింపులకు పాల్పడి అసభ్యంగా ఫోటోలు, వీడియోలు తీసిన డబ్బు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భావన ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, తాజాగా ఈ పరిణామాలపై భావన స్పందించారు.
నేను చేయని తప్పుకు (శత్రువులకు) ఎప్పుడూ క్షమాపణలు చెప్పనని… రాజీపడి పదేపదే క్షమాపణలు చెప్పే బదులు… అహంకారిగా ముద్ర వేయించుకోడమే నాకిష్టమని తెలిపింది భావన. ఈ ఘటన వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేసింది.
నాకే కాదు… ఎవరికైనా ఇలా జరగొచ్చు. నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడితే… ఇతరులూ మాట్లాడతారు. ఇలాంటి ఇష్యూలను బయటపెట్టడానికి భయపడి తప్పు చేసినోళ్లకు తప్పించుకునే ఛాన్స్ ఎందుకివ్వాలి? నేరం చేసినోళ్లే సిగ్గు పడాలని తెలిపింది. మహిళలు కాదు. నేను ఈ ఘటనపై మౌనం వహించి ఉంటే, నా అత్యంత సన్నిహితులు ఓ ఐదు లేదా పది మందికి తెలిసేది. కానీ, నలుగురిలో ఘటన గురించి మాట్లాడలేదనే అపరాధ భావంతో తల ఎత్తుకోలేక పోయేదాన్ని. తప్పు చేశాననే బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది. అందుకే, కంప్లయింట్ చేశా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టనని తెలిపింది.
ఓ చోటు నుంచి మరో చోటుకి కారులో తీసుకువెళ్లే డ్రైవర్‌కి ఇలా చేసే దమ్ముంటుందా? ఎలా చేయగలడు? అసలు ఎవరు ఇదంతా చేయించారు? ఎందుకు చేయించారు? ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు.ఈ ఘటన వెనుక నా శత్రువుల హస్తం ఉందని చెప్పడం లేదు. కానీ, కేవలం డబ్బు కోసమే నన్ను వేధించారా? అనే కోణంలోంచి ఆలోచించినా లింక్స్ కనెక్ట్ కావడం లేదని తెలిపింది. కానీ ఈ విషయంలో నేను గెలిచే వరకూ పోరాడతానని స్పష్టం చేసింది.