భారత సంతతికి చెందిన కూచిబొట్ల శ్రీనివాస్ హత్యోదంతం మనసులనుండి చెరిగిపోకముందే.. అమెరికా దక్షిణ కరోలినా లోని భారత సంతతి, గుజరాత్ వడోదర వాస్తవ్యుడు, వ్యాపారస్తుడు హర్నిష్ పటేల్ హత్యకు గురికావడం పట్ల కేంద్ర కార్మిక మరియు ఉపాధికల్పనశాఖామాత్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమెరికాలో జరుగుతున్న వరుస పరిణామాలు చాలా దురదృష్టమన్నారు.
వాషింగ్టన్ రాష్ట్రంలో నివసిస్తున్న శ్రీ దీప్ రాయ్ అనే భారతీయుని పై జరిగిన జాత్యహంకార దాడిని కూడా శ్రీ బండారు దత్తాత్రేయ గారు తీవ్రంగా ఖండించారు. భారత ప్రభుత్వం ఈ దాడులను చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. శ్రీ ఎస్ జయశంకర్, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఇప్పుడు అమెరికా లోనే పర్యటిస్తూ దౌత్యపరమైన చర్యలద్వారా, ద్వైపాక్షిక సంప్రదింపుల ద్వారా భారతీయులకు భద్రతకల్పించడంలో అమెరికా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతున్నారు. 28 లక్షల భారతీయ సంతతివారు అమెరికా అభ్యున్నతికి తీవ్రంగా కృషిచేస్తున్నప్పుడు జాతి విద్వేష దాడులు జరగడం అమెరికాకు మంచిది కాదని అమెరికా ప్రజలు గుర్తెరగాలన్నారు.
అమెరికాలోని కొంతమంది చేస్తున్న దుశ్చర్యల మూలంగా భారత సంతతి వారు, మానసిక ధైర్యం, ఆత్మ బలం కోల్పోరాదని శ్రీ బండారు దత్తాత్రేయ కోరారు. అమెరికా అభ్యున్నతికి భారత సంతతివారు చేస్తున్న కృషిని అమెరికా ప్రజలకు చాటి చెప్పాలని కోరారు. అమెరికా ప్రభుత్వం ఇకముందు ఇలాంటి దుస్సంఘటనలు, జాతి విద్వేష దాడులు జరుగకుండా జాత్యాహంకార భావనలు పెట్రేగకుండా అన్ని చర్యలు సత్వరంగా తీసుకొని భారత సంతతిలో ఆత్మస్థైర్యం నింపాలని శ్రీ బండారు దత్తాత్రేయ గట్టిగా కోరారు