విజయం ఆ పార్టీదే : ఉండవల్లి!

47
- Advertisement -

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అధికార వైసీపీతో పాటు టీడీపీ జనసేన కూటమి గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో అధినేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత సి‌ఎం జగన్మోహన్ రెడ్డి సిద్దం పేరుతో ప్రచారాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అటు టీడీపీ జనసేన పార్టీలు కూడా, సంసిద్దం, శంఖారావం.. వంటి కార్యక్రమాలతో ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇటువైపు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై తరచూ సర్వేలు తెరపైకి వస్తున్నాయి. టీడీపీ జనసేన కూటమిదే ఈ సారి అధికారమని కొన్ని సర్వేలు చెబుతుంటే.. మరికొన్ని సర్వేలు అధికార వైసీపీకి పట్టం కడుతున్నాయి. ఇలా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న వేళ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై తాజాగా మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి జగన్ ఓటమి ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్న టైమ్ లో కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్.. విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఈసారి జరిగే ఎన్నికలతో ఆయన పోలిటికల్ రీఎంట్రీ ఉండనుందని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని గుసగుసలు గట్టిగానే వినిపించాయి. కానీ వాటిపై ఎలాంటి స్పష్టత లేదు. ఏది ఏమైనప్పటికి అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అనే దానిపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

Also Read:Kavitha:సీఎం రేవంత్‌వి సంకుచిత వ్యాఖ్యలు

- Advertisement -