భారతీయుల ముఖ్య పండుగ దీపావళిని మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి నిర్వహించింది. ఈమేరకు న్యూయార్కులోని యూఎన్‌వో బిల్డింగ్‌ను మిరుమిట్లు గొలిపే దీపాలతో అలంకరించి తొలిసారిగా వేడుకలు నిర్వహించారు. హ్యాప్పీ దీపావళి అని విద్యుత్ లైట్లతో ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారిగా ఐక్యరాజ్యసమితి కార్యాలయం దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసిందంటూ యూఎన్ భారతీయ రాయబారి సయీద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. దీంతో పాటు ఫొటోలను పోస్ట్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
మూడు రోజుల పాటు ఐరాస ప్రధాన కార్యాలయం దీపావళి వెలుగుల్లో ఉండనుంది. యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ పీటర్ థామ్సన్ ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించే విజయానికి గుర్తుగా ఐరాస దీపావళి వెలుగులు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రవాస భారతీయులు, స్థానికులు ఐక్యరాజ్యసమితి కార్యాలయం వద్ద సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు.