తెలంగాణ భవన్‌లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఘనంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమం రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సంప్రదాయ పూజలతో ప్రారంభమైన ఈ వేడుకలో అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు.
ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను వివరించారు. వారి అంచనాల ప్రకారం, ప్రభుత్వ పాలనలో లోటుపాట్లు, వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయమైన బలం చేకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు ఏర్పడతాయని వారు స్పష్టం చేశారు.
విద్యా రంగంపై కూడా పండితులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని, యువత పక్కదారి పట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని సూచించారు.
Also Read:హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
అంతర్జాతీయ పరిస్థితులపై కూడా వారు స్పందిస్తూ, విదేశీ శక్తుల నుంచి వచ్చే సవాళ్లను భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఇరుగుపొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు.
ఇక వ్యవసాయ రంగానికి వస్తే, ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండే సూచనలు ఉన్నాయని పండితులు తెలిపారు. మొత్తంగా ఈ పంచాంగ శ్రవణం రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై కీలక సూచనలు చేస్తూ ప్రాధాన్యం సంతరించుకుంది.

