కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజకీయాల్లో రాహుల్ శకం మొదలైనట్టేనని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన, గుజరాత్ ఫలితం ఎలా ఉన్నా, కాంగ్రెస్ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోయడంలో రాహుల్ పరిపూర్ణత సాధించాడని, బీజేపీకి, నరేంద్ర మోడీకి ఎదురు నిలువగల ఏకైక నేత రాహుల్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
మోడీ, అమిత్ షా వంటి దిగ్గజ నేతలు గుజరాత్ యుద్ధ భూమిలో ఉండగా, వారిని రాహుల్ ఎదుర్కొన్న తీరు అద్భుతమని, ఇక కేంద్రంలోని అధికార బీజేపీ రాహుల్ ను విమర్శించడం మానుకొని, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని చురకలు అంటించారు.
గుజరాత్‌లో బీజేపీ ఇప్పటివరకూ 5 స్థానాల్లో గెలుపొంది మరో 99 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించి 74 స్థానాల్లో ముందంజలో ఉంది. హిమాచల్‌లో బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించి 38 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ ఒక్క స్థానంలో విజయం సాధించి 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.