అండర్ – 19 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ఆసక్తికర ఫైట్ జరగనుంది. సెమీఫైనల్లో భాగంగా దాయాది దేశం పాకిస్ధాన్‌తో తలపడనుంది భారత్. ప్రపంచకప్‌లో పాక్‌ను మట్టికరిపించి విశ్వకప్పుని ముద్దాడాలని ప్రియం గార్గ్ సేన ఎదురుచూస్తోంది.
మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది. గత రెండు పర్యాయాలు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన యువ భారత జట్టు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి వరుసగా మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్‌లో భారత జట్టు బలంగా కనిపిస్తున్నా.. లెఫ్టార్మ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పైనే ఎక్కువ ఆధార పడుతోంది.
ఇక గత ప్రపంచకప్‌లో భారత్ చేతిలో 203 పరుగుల తేడాతో ఓడిన పాక్.. ఈ సారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అయితే 2010 అండర్-19ప్రపంచకప్ తర్వాత మెగాటోర్నీలో పాక్ జట్టు భారత్‌పై విజయం సాధించలేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: ప్రియం గార్గ్ (కెప్టెన్), యశస్వి, దివ్యాన్ష్, తిలక్ వర్మ, ధృవ్ జురేల్, సిద్ధేశ్, అథర్వ, రవి, సుశాంత్, కార్తీక్, ఆకాశ్
పాకిస్థాన్: రోహైల్ నజీర్ (కెప్టెన్), హైదర్ అలీ, హురేరా, ఫహద్, ఖాసిం, హరీస్, ఇర్ఫాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రీది, తాహిర్, అమీర్ అలీ, అమీర్ ఖాన్