తెలుగు ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్య ఘటన మరువక ముందే అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. న్యూజెర్సీలో నివాసమంటున్న ఇద్దరు తెలుగువారు దారుణ హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి ఆయన భార్య శశికళ(40), కొడుకు హనీశ్ సాయి(7) రక్తపు మడుగులో విగత జీవులుగా పడివున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దోపిడీకి వచ్చిన దుండగులే ఈ దాడికి పాల్పడ్డారా? లేక ఇంకెవరైనా జాత్యహంకారాలు దాడికి పాల్పడ్డారా? అనేది తేలాల్సివుంది. సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు చర్యలను ముమ్మరం చేశారు.
నర్రా హనుమంతరావు గత 12ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. కాగా, ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికాలోని భారతీయులపై దాడులు జరుగుతునే ఉన్నాయి.ట్రంప్ కొత్త పాలసీతో భారతీయులకు అమెరికాలో రక్షణ లేకుండా పోతోంది. మత, జాతి, వివక్ష, వలస జీవులపై వ్యతిరేకతతో విద్వేష పూరిత దాడులు జరుగుతున్నాయి. ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ.. వలస జీవులు వెళ్లిపోవాలంటూ దాడులు, కాల్పులకు పాల్పడుతుండడంతో అమెరికాలో భారతీయులు భయంభయంగా గడుపుతున్నారు.