తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు కరీంనగర్ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ. తెలంగాణలో మీడియాతో మాట్లాడిన ఉమ టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని సీఎం కేసీఆర్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంలో నిజం లేదని…దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని …మంచి సంకల్పంతో బంగారు తెలంగాణ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకోవడం వల్లనే విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది చెప్పాలన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రజలను హరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు సుమన్. మహాకూటమి పేరుతో ప్రజలను వంచించేందుకు వస్తున్న విపక్షాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు.