TTD: తొలిసారి తెలుగు క్యాలెండర్

25
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులందరికీ శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర‌ ఉగాది శుభాకాంక్షలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలియజేశారు. మొట్ట‌మొద‌టిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్‌ను టీటీడీ ప్రచురించిందని, వచ్చే వారం నుంచి భ‌క్తుల‌కు అందుబాటులోకి రానున్నాయని ఈవో తెలిపారు.

తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్‌లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉగాది శుభాకాంక్షలు :

•⁠ ⁠శ్రీవారి భక్తులకు, దాతలకు, అర్చకులకు, టిటిడి సిబ్బందికి, శ్రీవారి సేవకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

•⁠ ⁠ఏప్రిల్‌ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా టిటిడి ఆస్థాన పండితులు ఆస్థానం, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఇందులో దేశకాల, ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారఫలాలను పండితులు తెలియజేస్తారు.

శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగం :

•⁠ ⁠శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని టిటిడి బుక్‌స్టాళ్లలో అందుబాటులో ఉంచాం.

•⁠ ⁠హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉంది.

ఏప్రిల్‌ 5న తిరుమలలో శ్రీ అన్నమయ్య 521వ వర్థంతి

•⁠ ⁠శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 521వ వర్థంతి మహొత్సవం ఏప్రిల్‌ 5న సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాల్లో ఘనంగా నిర్వహిస్తాం.

ఏప్రిల్‌ 21 నుండి 23వ తేది వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు :

•⁠ ⁠ఈ నెల 21 నుండి 23వ తేది వరకు తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము.

•⁠ ⁠ఇందులో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

•⁠ ⁠ఏప్రిల్‌ 22వ తేదీ ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవార్లు స్వర్ణరథంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇస్తారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు :

•⁠ ⁠టిటిడికి అనుబంధంగా ఉన్న పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం.

•⁠ ⁠ఏప్రిల్‌ 22వ తేదీన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం.

•⁠ ⁠భక్తులు విచ్చేసి బ్రహ్మోత్సవాల వైభవాన్ని తిలకించాలని కోరుతున్నాం.

టిటిడి స్థానిక ఆలయాలలో బ్రహ్మోత్సవాలు :

•⁠ ⁠ఈ రోజు నుండి 13వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు,

•⁠ ⁠ఏప్రిల్‌ 12 నుండి 20వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు,

•⁠ ⁠ఏప్రిల్‌ 17 నుండి 25వ తేదీ వరకు చంద్రగిరిలోని శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

Also Read:సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో అశోక్ గల్లా

- Advertisement -