జనవరి 13వ తేది నుండి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి నమూన ఆలయాన్ని నాగ వాసుకి ఆలయ సమీపంలోని సెక్టార్-6 వద్ద ఆదివారం ప్రారంభించింది.
ఇంజినీరింగ్ నిపుణులు, టీటీడీ సిబ్బంది నమూన ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉత్తరాది భక్తులకు కుంభమేళాలలో శ్రీవారి వైభవాన్ని తెలియజేసేందుకు టీటీడీ నమూన ఆలయాన్ని ఏర్పాటు చేసింది. జనవరి 13వ తేది నుండి కుంభమేళాకు వచ్ఛే భక్తులందరూ శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ముందుగా తిరుచ్చి పై స్వామి అమ్మవార్లను త్రివేణి సంగమం చెంతకు వెళ్లి పవిత్ర గంగా జలాలను కలషంలో నింపుకుని తీసుకువచ్చి ఆలయంలో ప్రోక్షణ చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
తదనంతరం ఆలయంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీవారి చల ప్రతిష్ట, వాస్తు హోమం, నిత్య హోమం, ఇతర ప్రత్యేక పూజాది కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి.
అనంతరం కలషంలోకి ఆవాహన చేసునటువంటి పుణ్య జలాలతో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి నివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనాలకు అనుమతించి ప్రసాదాల వితరణ చేశారు.