ప్రజాప్రతినిధులే నేరుగా శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకునేలా టీటీడీ ప్రణాళిక రూపొందిస్తుంది. శ్రీవారి దర్శనానికి వచ్చేవారిలో సగానిపైగా బ్రేక్ దర్శనాల కోసమే ఆరాటపడుతున్నారు. నిత్యం ఎవరో ఒక ప్రజాప్రతినిధి సిఫారసు లేఖతో వచ్చి తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయం అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధుల నుంచి రోజుకు 2, 3 లేఖలు కూడా వస్తున్నాయి.
గతంలో ప్రత్యేకంగా సాఫ్ట్వేరు తయారుచేసి టీటీడీ బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులకే యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయించారు. కోటాకు తగినట్టు వారే ఆన్లైన్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసి భక్తులకు అందజేసేవారు. ఇదే పద్ధతిని ప్రజాప్రతినిధులకూ అమలుచేయడంపై అధికారులు పరిశీలిస్తున్నారు. తెలంగాణ నేతల సిఫారసు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించేందుకు ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో నూతన విధానం అమలులోకి తెస్తే ప్రజాప్రతినిధులే తమ కోటాకు తగినట్టు ఆన్లైన్ ద్వారా బ్రేక్ టికెట్లు బుక్ చేసుకుంటారని భావిస్తున్నారు. ఇందులో ఉన్న సమస్యలపైనా అధికారులు దృష్టి సారించారు. ఈ విధానంలో నేతలు వంద శాతం కోటాను వినియోగించుకుంటారు.