శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఫిబ్రవరి 18వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై ఫిబ్రవరి 26వ తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేసి తిరుమల బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల కటౌంట్లు, దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ప్రచార రథాల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ముఖ్య ప్రజాసంబంధాల అధికారికి సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రోజువారి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని, వాహనసేవలలో స్వామి, అమ్మవార్లకు అలంకరించే ఆభరణాలు అకర్షణియంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన గరుడసేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహారం, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటుచేయాలన్నారు.
Also Read:Delhi Exit Polls:బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్!
భక్తుల రద్దీకి అనుగుణంగా మొబైల్ మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ద్య కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్‌ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టిటిడి విజిలెన్స్ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

