తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో జరగనున్న విశేష పర్వ దినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• జూన్ 5న మెయిన్ వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం.
• జూన్ 9న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, నమ్మాళ్వార్ శాత్తుమొర.
• జూన్ 11న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సమాప్తం.
• జూన్ 21 స్మార్త ఏకాదశి.
• జూన్ 22న వైష్ణవ మాధ్వ ఏకాదశి.
• జూన్ 26న పెరియాళ్వార్ ఉత్సవారంభం.
వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. రద్దీ కారణంగా దర్శన సమయం ఆలస్యమవుతున్నప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో అధిక సంఖ్యలో భక్తులకు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శన క్యూలైన్లలో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్న, పానీయాలను నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు.
అన్నీ విభాగాల అధికారుల సమన్వయంతో పని చేస్తూ భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేందుకు కృషి చేస్తున్నారు. విజిలెన్స్, ఆలయ విభాగాలు సమర్థవంతంగా క్యూలైన్లను నిర్వహిస్తుండటంతో సాధారణ రోజుల్లో కంటే 10వేల మంది వరకు భక్తులకు అదనంగా దర్శన భాగ్యం కలుగుతోంది.
ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల్లో (గురు, శుక్ర, శని, ఆదివారాల్లో) శ్రీవాణి దర్శనాలు కొనసాగుతున్నపటికీ కూడా 3,28,702 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అన్న ప్రసాదం విభాగం ద్వారా 10,98,170 మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందించగా, 4,55,160 మంది భక్తులకు పానీయాలు (టీ/కాఫీ/పాలు/మజ్జిగ) అందించారు.
ఈ నాలుగు రోజుల్లో 1,52,587 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, టీటీడీ వైద్య విభాగం ద్వారా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 12,172 మంది భక్తులు వైద్య సేవలు పొందారు.
Also Read:బెల్లంతో లాభాలు ఎన్నో!

