TTD EO:నాపై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు స‌రికాదు

41
- Advertisement -

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో పూర్తి పార‌ద‌ర్శ‌కంగా పాల‌న జ‌రుగుతోంద‌ని, విస్తృతంగా ధ‌ర్మ‌ ప్ర‌చారంతోపాటు భ‌క్తుల సౌక‌ర్యాల‌కు పెద్ద‌పీట వేస్తున్నామ‌ని, సంక్షేమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంక‌ట‌ర‌మణారెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఈవో స్పందించారు. త‌న‌పై అవాస్త‌వాల‌తో కూడిన వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌డం బాధాక‌ర‌మ‌ని, వాస్త‌వాలు తెలుసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. ఆయన ఆరోపణలను ఈవో ఖండించారు.

ఈవోగా ప‌నిచేయ‌డానికి త‌న‌కు అర్హ‌త లేద‌ని ఆరోపించార‌ని ఇది వాస్త‌వం కాద‌న్నారు. దేవాదాయ చ‌ట్టం 107వ సెక్ష‌న్ ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ లేదా ఆ పోస్టుకు స‌మాన‌మైన హోదా ఉన్న‌వారు ఈవోగా ప‌నిచేయ‌డానికి అర్హుల‌ని తెలిపారు. తాను 1991 బ్యాచ్ సివిల్ స‌ర్వీసెస్ ఐడిఇఎస్ అధికారిన‌ని, 33 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉంద‌ని చెప్పారు.

ఢిల్లీలో త‌న‌పై క్రిమిన‌ల్ కేసు ఉంద‌ని స‌ద‌రు నేత ఆరోపించార‌ని, దీనికి సంబంధించిన వాస్త‌వ వివ‌రాలు ఇలా ఉన్నాయ‌ని చెప్పారు. 2014లో ఢిల్లీ కంటోన్మెంట్ డిఫెన్స్‌ సిఈవోగా ఉన్నప్పుడు అక్రమ కట్టడాలపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామ‌న్నారు. 2020లో వారు కోర్టులో ప్రయివేటు కేసు వేస్తే దానికి సంబంధించిన‌ సమన్లు గత ఏడాది జారీ చేశార‌ని చెప్పారు. సమన్లు స్వ్కాష్ చెయ్యాలని కోర్టులో కేసు వేస్తే దానిపై స్టే విధించార‌ని తెలిపారు. ఇందులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేద‌ని, అప్పుడు నిబంధ‌న‌లు పాటించ‌నివారిపై మాత్ర‌మే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు.

తిరుమ‌ల‌లో ద‌ర్శ‌న ద‌ళారుల‌ను అరిక‌ట్టామ‌ని, శ్రీ‌వాణి ట్ర‌స్టుకు ఇప్ప‌టివ‌ర‌కు రూ.1,021 కోట్ల విరాళాలు అందాయ‌ని తెలిపారు. ఇప్పటివరకు 550 ఆల‌యాలు నిర్మించడం జరిగింది. 3 వేలకు పైగా ఆలయాలు వివిధ దశల్లో ఉన్నాయి. 176 పురాత‌న ఆల‌యాల జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టామ‌ని వివ‌రించారు.

2019 జూన్ నుండి 2023 అక్టోబ‌రు వ‌ర‌కు దాదాపు రూ.4800 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, దాదాపు 3885 కిలోల బంగారం డిపాజిట్లు పెరిగాయ‌ని ఈవో వెల్ల‌డించారు. ఎస్వీబీసీని విస్తృతంగా భ‌క్తుల్లోకి తీసుకెళ్లామ‌ని, భ‌క్తులు స్వ‌చ్ఛందంగా రూ.50 కోట్ల‌కు పైగా విరాళాలు అందిచార‌ని చెప్పారు. స్విమ్స్‌లో రూ.77 కోట్ల‌తో నూత‌నంగా కార్డియో, న్యూరో బ్లాక్ నిర్మిస్తున్నామ‌ని, అదేవిధంగా, రూ.197 కోట్ల‌తో నాలుగేళ్ల‌లో ద‌శ‌ల‌వారీగా మొత్తం భ‌వ‌నాల‌ను ఆధునీక‌రిస్తామ‌ని తెలియ‌జేశారు.

Also Read:Bigg Boss 7 Telugu:ఎవిక్షన్‌ ఫ్రీ పాస్ యావర్‌దే

- Advertisement -