TTD:6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

35
- Advertisement -

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 ల‌క్ష‌ల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం క‌ల్పించామ‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మీడియాతో మాట్లాడిన ఈవో.. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా వారికి నిర్దేశించిన స‌మ‌యంలోనే సంతృప్తిక‌రంగా స్వామివారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించామ‌న్నారు. ద‌ర్శించుకున్న భ‌క్తుల‌తోపాటు అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించిన భ‌క్తుల సంఖ్య గ‌తం కంటే పెరిగింద‌ని చెప్పారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేశామ‌న్నారు. 10 రోజుల‌కు క‌లిపి విఐపి బ్రేక్ ద‌ర్శ‌నానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామ‌ని, 18,578 మంది హాజ‌రుకాగా, 677 మంది(3.3 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. దాత‌ల‌కు బ్రేక్ ద‌ర్శ‌నానికి సంబంధించి ఆన్‌లైన్‌లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నార‌ని, 6,388 మంది హాజ‌రుకాగా, 470 మంది(7 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని వివ‌రించారు.

శ్రీ‌వాణి దాత‌ల‌కు మొత్తం 20 వేల ఎస్ఇడి టికెట్లు జారీ చేశామ‌ని, 19,083 మంది హాజ‌రుకాగా, 917 మంది(4.5 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని తెలియ‌జేశారు. రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి సంబంధించి మొత్తం 2.25 ల‌క్ష‌ల టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నార‌ని, 1,97,524 మంది హాజ‌రుకాగా, 27,476 మంది(12.2 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లు మొత్తం 4.23 ల‌క్ష‌లు మంజూరు చేశామ‌ని, 3,24,102 మంది హాజ‌రుకాగా, 90,850 మంది(21.5 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని వెల్ల‌డించారు.

Also Read:సీఎం రేవంత్‌ని కలిసిన సింగరేణి సీఎండీ బలరాం

- Advertisement -