బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకో గుడ్ న్యూస్. ఇకపై బస్‌పాస్‌ల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చోవడం, రోజుల తరబడి వాటి కోసం వేచిచూడడం వంటి కష్టాలు ఉండవు. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్…దేన్నుంచైనా ఇక తేలిగ్గా బస్‌పాస్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈమేరకు ఆన్‌లైన్‌లో బస్‌పాస్ రెన్యూవల్ దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రేటర్ ఆర్టీసీ కార్యాచరణ రూపొందిస్తోంది.
విద్యార్థులు బస్‌పాస్‌ల కోసం ఇబ్బందులు పడకుండా 2017-18 నుంచి విద్యార్థి బస్‌పాస్‌లు ఆన్‌లైన్‌లో తీసుకునేలా గ్రేటర్ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకిచ్చే ఫ్రీ, స్టూడెంట్ జనరల్, స్టూడెంట్ గ్రేటర్, స్టూడెంట్ స్పెషల్, స్టూడెంట్ ఎక్స్‌క్లూజివ్, డిస్ర్టిక్ట్ రూట్ పాస్‌లన్నీ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వివిధ విద్యా సంస్థలకు కొత్త బస్‌పాస్ కోడ్‌ను జారీచేయడానికి, ఇప్పటికే ఉన్న సంస్థ కోడ్‌ను పునరుద్ధరించడానికి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు 2017-18 విద్యాసంత్సరంలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విద్యార్థులు బస్‌పాస్‌ల ధృవీకరించే ముందు కళాశాల అందించే అన్ని కోర్సులను అవసరమైన పత్రాలను టీఎస్ ఆర్టీసీ బస్‌పాస్ కార్యాలయంలో అందజేసి, అడ్మినిస్ట్రేటివ్ ఫీజు చెల్లించి బస్‌పాస్ కోడ్ పొందాలన్నారు.
ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలకు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించకుండా మినహాయించి నట్లు, అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు, అడ్మినిస్ర్టేటివ్ చార్జీలు చెల్లించిన రసీదుతో పాటు టీఎస్‌ఆర్టీసీ అధికారిక వైబ్‌సైట్‌లో ఆర్టీసీ మార్గదర్శకాలు పరిశీ లించుకోవచ్చన్నారు. విద్యా సంస్థ కోడ్‌తో కూడిన విద్యా సంస్థఖాతా లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ వివరాలను ఆర్టీసీకి విద్యాసంస్థలు ఇచ్చిన సెల్‌ఫోన్ నంబర్‌కు సంక్షిప్త సందేశం ద్వారా అందుతాయన్నారు.
ఇక ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో విద్యార్థుల బస్‌పాస్‌ల రెన్యూవల్ దరఖాస్తులను స్వీకరించేందుకు గ్రేటర్ ఆర్టీసీ కార్యాచరణ చేపడుతోంది. బస్‌పాస్ కౌంటర్‌ల వద్ద రద్దీ, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ విద్యాసంవత్సరం నుంచి రెన్యూవల్ పాస్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించే పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు.