కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు అందించింది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమల వెళ్లే తెలంగాణ భక్తులకు.. బస్సు టికెట్‌తో పాటు దర్శనం టికెట్‌ను కూడా అందించనున్నారు. ప్రతిరోజు సూమారు ఒక వెయ్యి మంది భక్తులకు రూ.300 విలువైన ప్రత్యేక దర్శన టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటును టీటీడీ కల్పించింది. ఈ వెసులుబాటు టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవతో సాధ్యమైంది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి బాజిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లను నేటి నుంచి ప్రారంభిస్తునట్లు తెలిపారు. ఇక బస్సులు మాత్రం జులై 8 అంటే శుక్రవారం నుండి తిరుమలకు బయల్దేరుతాయని ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు బస్ టికెట్‌తో పాటే తిరుమల శీఘ్ర దర్శన టోకెన్ కూడా పొందే వీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతికి టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకునే ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. www.tsrtconline.in వెబ్‌సైట్ ద్వారా లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చని తెలిపారు. కనీసం 7 రోజుల ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఈసందర్భంగా చెప్పారు.