టీఎస్ఆర్టీసీ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు నూతన ఎలక్ట్రిక్ వాహనం కింద బస్సులను ఎలక్ట్రిక్ మోడ్‌లోకి ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడాలని భావిస్తోంది. ఇప్పటికే పాత బస్సులను కార్గో సర్వీసులుగా మార్చి కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న టీఎస్ఆర్టీసీ రోజురోజుకు పెరిగిపోతున్న డీజీల్ ధరల నష్టాల నుండి బయటపడేందుకు ఎలక్ట్రిక్ బస్సుల బాట పట్టాలని నిర్ణయించింది.
ఇందుకోసం డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ఓ ప్రైవేటు సంస్థకు ఒక సిటీ బస్సును కేటాయించింది. సిటీ బస్సు డీజిల్ ఇంజన్‌ను ఎలక్ట్రిక్ ఇంజన్‌గా మార్చి మూడు నెలలపాటు దాని పనితీరును పరిశీలించనుంది. డీజీల్ బస్సు నిర్వహణ వ్యయాన్ని…ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ వ్యయానికి ఎంత తేడా ఉండనుందో లెక్కలతో చూపించనుంది ఆ సంస్థ.
ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తే ఒక్క హైదరాబాద్ సిటీ రీజియన్ పరిధిలో డీజిల్ రూపంలో అవుతున్న రూ. 460 కోట్ల వార్షిక భారం తొలగిపోనుంది. అదే మొత్తం సంస్థకు వర్తిస్తే ఏకంగా రూ. 1,926 కోట్ల వ్యయం తప్పుతుంది. టీఎస్ఆర్టీసీ చేసిన ఈ ప్రయోగం ఎంతవరకు సత్ఫలితాన్నిస్తాయో వేచిచూడాలి.