మేడారం సమ్మక్క-సారలమ్మ ఉత్సవ జాతర దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర అని చెప్పవచ్చు.. ఈ జాతరను ‘తెలంగాణ కుంభమేళా’అని కూడా అభివర్ణిస్తారు. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే ఈ మహా జాతర ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానుంది 8న వన ప్రవేశంతో ముగుస్తుంది. ఇక మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్తను అందించింది.
ఫిబ్రవరి నుండి జరిగే మేడారం జాతర ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీలోపల దైవదర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు వారి వారి ఇండ్లవద్దకే బస్సులు పంపనున్నట్లు నగరంలోని చెంగిచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ వి.మల్లయ్య తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అదనపు సమాచారం, బస్సుల బుకింగ్ కోసం డిపో మేనేజర్7893088433, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) 7382924742 సంప్రదించవచ్చు.