సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే ప్రజా రవాణా సేవల్ని ప్రస్తుత పరిస్థితుల్లోనూ మెరుగ్గానే అందించే దిశలో టి.ఎస్.ఆర్టీసీ అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. సమ్మె నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటున్న ప్రైవేట్ డ్రైవర్స్, ప్రైవేట్ కండక్టర్ల సహాయంతో స్వతహాగా ఆర్టీసీకి చెందిన బస్సుల్ని నడపడంతో పాటు అద్దె బస్సుల్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది.
ఈ మేరకు ప్రజా రవాణాలో ఇబ్బందులు లేకుండా కాస్త అటూ ఇటుగా మూడొంతుల సర్వీసుల్ని అందుబాటులో ఉంచుతోంది. దీంతో ప్రయాణీకులకు కొంత మేర రవాణా ఇక్కట్ల మబ్బులు తొలిగిపోయాయి. రవాణా శాఖా మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, టి.ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మలు ప్రయాణీకులు బస్సుల కోసం ఏదురు చూసే పరిస్థితి రాకుండా చూడాలని, ఎక్కువ మొత్తంలో బస్సుల్ని నడపడానికి డిపో మేనేజర్లు కృషి చేయాలని సూచించారు.
వీరి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ బస్ సర్వీసు సేవలపై అధికారులు ఫోకస్ పెడుతున్నారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 10,788 (ప్రైవేట్ డ్రైవర్స్-4435, ప్రైవేట్ కండక్టర్స్-6353) తాత్కాలిక సిబ్బందితో 6353 బస్సుల (ఆర్టీసీ-4435, అద్దె బస్సులు-1918) ను తిప్పగలిగారు. మొత్తం 5917 బస్సుల్లో (టిమ్స్-5400, టిక్కెట్ల జారీ-517) టిక్కెటింగ్ విధానం అమలులోకి వచ్చింది.