రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ ఇసుక సరఫరాలో అవినీతిని అరికట్టేందుకు నడుం బిగించింది. ఈ మేరకు చైర్మన్ శేరి సుబాశ్ రెడ్డి, యం.డి మల్సూర్, ఉన్నతాధికారుల పర్యవేక్షణతో సంస్థ కార్యాలయంలో ఇసుక కాంట్రాక్టర్లు మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణను , నకిలీ వే బిల్లులను అరికట్టేలా పలు చర్యలు తీసుకోవాలని సూచించారు. లారీలలో అధిక లోడు లేకుండా చూడాలని ఎవరైనా అతిక్రమిస్తే ఆ లారీలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని చైర్మన్ సుభాష్ రెడ్డి హెచ్చరించారు.
కాంట్రాక్టర్లు , ప్రాజెక్ట్ ఆఫీసర్లు అందరు వారి వారి విధులలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలని సూచించారు. ఇసుక రీచులలో అవసరమైన వే బ్రిడ్జులు, చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇసుక రీచుల్లో నిర్ధారించిన హద్దులు దాటి తవ్వకూడదని సూచించారు. కాంట్రాక్టర్లు వారి విధుల్ని సక్రమంగా నిర్వహించకుంటే మొదట నోటీసులు ఇచ్చి ఆ తర్వాత తగిన చర్యలు తీసుకోకతప్పదని పేర్కొన్నారు. అవసరమైతే వారి లైసెన్సులు కూడా రద్దు చేస్తామన్నారు.
ఇప్పటికే అధికారులకు ఈ మేరకు పలు సూచనలు జారీ చేశామని, ఇసుక అక్రమాలను అరికట్టడంలో అధికారుల వ్యక్తిగతంగా భాద్యత తీసుకోవాలని చైర్మన్ తెలిపారు. ఇసుక ప్రజల ఆస్థి అని, దీన్ని ప్రజలకు చౌక ధరల్లో అందుబాటులో ఉంచాలనే ముఖ్యమంత్రి అలోచన మేరకు ఖనిజాభివృద్ది పనిచేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో చైర్మన్ శేరి సుబాశ్ రెడ్డి , మేనెజింగ్ డైరెక్టర్ జి. మల్సూర్, జనర మేనేజర్లు రాజిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఉదయరాజ్ , ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఇసుక కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.