ఇంకో మూడు రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. చత్తీస్‌గఢఖలో ఈనెల 12న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఇతర రాష్ట్రాలకు దశలవారీగా పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 7వ తేదీన తెలంగాణ, రాజస్థాన్ లకు జరిగే ఎన్నికలతో ఐదు రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 12న (సోమవారం) నాడు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల నేతలతో ఈసీ శుక్రవారుం సమావేశమయ్యారు.
అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ వివరాలను వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేరచరిత్రను అఫిడవిట్‌లో పొందుపర్చాలి. నేరచరిత్రకు సంబంధించి మూడుసార్లు దినపత్రికల్లో.. ఒకసారి టీవీలో ప్రకటన ఇవ్వాలి. నేర చరిత్రలేని వారు ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు క్రిమినల్ కేసుల అఫిడవిట్ దాఖలు, శాంతియుత, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణపై భేటీలో చర్చించారు.
అభ్యర్థులు డిక్లరేషన్‌తో పాటు మేనిఫెస్టో కాపీని ఈసీకి అందజేయాలి. 32,574 పోలింగ్ కేంద్రాలు 217 అనుబంధ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. సీఈవో దగ్గర ఫామ్-ఏ, రిటర్నింగ్ వద్ద ఫామ్-బీ ఇవ్వాలి. పార్టీలు మేనిఫెస్టోలు మూడు కాపీలను సీఈవో కార్యాలయంలో సమర్పించాలి. అభ్యర్థులు రెండు అంశాలపై ధృవీకరణ ఇవ్వాలి. నేర చరిత్ర ప్రకటన ఖర్చును ఎన్నికల వ్యయంలో భాగంగానే పరిగణిస్తాం. బ్యాలెట్ పత్రం గులాబీ రంగు, ఓటరు పత్రం తెలుపు రంగులో ఉంటుంది. ఇప్పటి వరకు రూ. 5 కోట్ల 16 లక్షల విలువ చేసే లిక్కర్, రూ. 64 కోట్ల 36 లక్షల నగదు సీజ్ చేసినట్లు.. 78 వేల 384 మందిని బైండోవర్ చేసినట్లు ఈసీ వెల్లడించారు.
నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు ఇంకా జరగాల్సి ఉందని చెప్పారు. సీ విజిల్ ద్వారా 1894 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. 1012 కేసులను పరిష్కరించామని, మిగతా వాటిని వివిధ దశల్లో డ్రాప్ చేశారని వెల్లడించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాల కోసం 4462 దరఖాస్తులు, ఓటు హక్కు కోసం ఇప్పటివరకు 3,50,962 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. 1,53,115 దరఖాస్తులు ఆమోదించామని, 13,326 తిరస్కరించినట్టు చెప్పారు. ఎన్నికల సన్నద్ధత బాగా జరిగిందన్నారు. ఫిర్యాదులపై పలువురు నేతలకు నోటీసులు జారీచేశామని రజత్‌కుమార్ వివరించారు.