రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారరయ్యాయి. ఈ నెల 27 నుంచి శాసనసభ, మండలి సమావేశాలను నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభుత్వం ప్రతిపాదనలను పంపింది. ఈ నెల 26న బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. అలాగే, శాసనసభలో చర్చ జరిగిన ప్రతీ అంశంపైనా మండలిలోనూ చర్చ జరగాలని పేర్కొన్నారు.
సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశంపై జవాబు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించి అన్ని విషయాలను అసెంబ్లీ ద్వారా వివరించాలని..ఇందుకోసం మంత్రులంతా సిద్దం కావాలని సీఎం సూచించారు. ప్రతిపక్ష సభ్యులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నిర్వహించడానికి మనకేం అభ్యంతరం లేదని సీఎం తెలిపారు.
రిజర్వేషన్ల పెంపుపై మరోసారి కేంద్రాన్ని కోరాలి. సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, ఉపాధి హామీ పనులను వ్యవసాయంతో అనుసంధానం చేయడం, తెలంగాణలో ఎయిమ్స్ స్థాపన అంశాలపై మరోసారి కేంద్రాన్ని అసెంబ్లీ గట్టిగా కోరాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఒత్తిడి పెంచాలన్నారు.
సభ హుందాగా నడవాలి..మాతృభాష పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని సీఎం ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ వరకు కచ్చితంగా తెలుగు సబ్జెక్టుగా ఉండాలనే నిబంధనల వల్ల మాతృభాష పరిరక్షణతోపాటు అనేక మంది తెలుగు పండిటక్లు ఉద్యోగావకాశం లభిస్తుంది. ప్రభుత్వం స్థాపించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలి. హైదరాబాద్‌లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలపై సభలో చర్చ జరగాలని సీఎం సూచించారు.