ఇరాన్ చర్చల టేబుల్ వద్దకు రాకపోతే, వచ్చే వారం నుండి ఆ దేశంలోని పవర్ ప్లాంట్లు (విద్యుత్ కేంద్రాలు), వంతెనలను (బ్రిడ్జిలు) లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు ప్రారంభిస్తుందని యుఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వాషింగ్టన్‌తో ఒప్పందం (డీల్) చేసుకోకపోతే ఇరాన్‌లో “ఎవరూ మిగలరు” అని స్పష్టం చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ…చర్చలు తిరిగి ప్రారంభం కాకపోతే రాబోయే రోజుల్లో ఇరాన్‌పై సైనిక చర్యను మరింత తీవ్రం చేస్తామని చెప్పారు. వచ్చే వారం వారికి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది…ఎందుకంటే వచ్చే వారం పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిల వంతు వస్తుంది. వారు చర్చల టేబుల్ వద్దకు వచ్చి చర్చలు జరపకపోతే మేము వారి పవర్ ప్లాంట్లను, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తాము అని ట్రంప్ పేర్కొన్నారు.
పశ్చిమ ఆసియాలో శత్రుత్వాన్ని ముగించడానికి వాషింగ్టన్ మరియు టెహ్రాన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం రద్దయిన తర్వాత ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు వరుసగా నాల్గవ రోజు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా మరియు ఇరాన్ ప్రతినిధులు ఇంకా సంప్రదింపుల్లోనే ఉన్నప్పటికీ హార్ముజ్ జలసంధి ద్వారా సముద్ర రవాణాను ఇరాన్ పరిమితం చేస్తున్నంత కాలం చర్చలు ముందుకు సాగవని ట్రంప్ ప్రభుత్వం పట్టుబడుతోంది.
ఈ సైనిక దాడులు ఎంతకాలం కొనసాగుతాయని ప్రశ్నించగా తాను చాలని నిర్ణయించే వరకు ఇవి కొనసాగుతాయని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌లోకి అమెరికా భూభాగ సైనికులను పంపే అవకాశంపై స్పందిస్తూ దాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చలేదు కానీ ఇతర మార్గాలకే తాను మొగ్గు చూపుతానని చెప్పారు. కొన్నిసార్లు గ్రౌండ్ క్యాంపెయిన్ అవసరమవుతుంది కానీ మన కోసం ఆ పని చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు అని వ్యాఖ్యానించారు.
ALso Read:కాపు ఉద్యమనేత ముద్రగడ ఇకలేరు..

