2021 జనవరి 6న వాషింగ్టన్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి ప్రసారం చేశారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC)పై 10 బిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ కేసు వేశారు. 2024లో ప్రసారమైన బీబీసీ ‘పనోరమా’ డాక్యుమెంటరీలో తన వ్యాఖ్యలను తప్పుగా చూపించారని ట్రంప్ ఆరోపించారు.
సోమవారం ఫ్లోరిడా దక్షిణ జిల్లా ఫెడరల్ కోర్టులో ఈ దావా దాఖలు చేసిన ట్రంప్, పరువు నష్టం కలిగించారనే ఆరోపణతో పాటు ఫ్లోరిడా డిసెప్టివ్ అండ్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్‌ను ఉల్లంఘించారంటూ బీబీసీ పై కేసు వేశారు. ఈ రెండు అంశాలకు కలిపి ఒక్కోటి 5 బిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 10 బిలియన్ డాలర్ల పరిహారం కోరుతున్నారు. ఈ కేసు ట్రంప్ వ్యక్తిగతంగా దాఖలు చేయగా, బీబీసీ తో పాటు బీబీసీ స్టూడియోస్ ప్రొడక్షన్స్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ట్రంప్ లీగల్ టీమ్ ప్రతినిధి ఫాక్స్ న్యూస్‌కు మాట్లాడుతూ, “ఒకప్పుడు గౌరవనీయమైన బీబీసీ ఇప్పుడు అపఖ్యాతిపాలైంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్ ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో వక్రీకరించింది. ట్రంప్‌పై కవరేజ్ విషయంలో బీబీసీ కు ప్రజలను మోసం చేసిన చరిత్ర ఉంది. ఈ కేసు ద్వారా బీబీసీ ను బాధ్యత వహింపజేస్తున్నాం” అని అన్నారు.
ఈ ఫిర్యాదులో ప్రధానంగా పనోరమా డాక్యుమెంటరీలో ప్రసారమైన ఒక క్లిప్‌ను ప్రస్తావించారు. అందులో జనవరి 6న ట్రంప్ తన మద్దతుదారులను క్యాపిటల్ వైపు వెళ్లాలని పిలుపునిచ్చిన వ్యాఖ్యలను, “ఫైట్ లైక్ హెల్” అనే మాటలతో కలిపి చూపించారు. అయితే, నిరసనలు శాంతియుతంగా ఉండాలని ట్రంప్ కోరిన మరో భాగాన్ని ప్రసారం నుంచి తొలగించారని ట్రంప్ ఆరోపించారు.
మియామీలో దాఖలైన 46 పేజీల కేసులో, ఈ ఎడిటింగ్ వల్ల తాను నేరుగా హింసకు ప్రోత్సహించినట్టుగా తప్పుడు భావన కలిగించారని ట్రంప్ పేర్కొన్నారు. ఆ ఆరోపణలను తాను ఎన్నిసార్లు ఖండించానని కూడా తెలిపారు. ఈ పనోరమా ఎపిసోడ్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు యూకేలో ప్రసారమైంది. అయితే అమెరికాలో మాత్రం ప్రసారం కాలేదు.
Also Read:కాంగ్రెస్ గుండాగిరిపై కేటీఆర్ కన్నెర్ర..
మీడియా సంస్థలపై ట్రంప్ వేస్తున్న పరువు నష్టం కేసుల్లో ఇది తాజాది. గత సెప్టెంబరులో డెమొక్రటిక్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ‘ది న్యూయార్క్ టైమ్స్’పై కూడా ట్రంప్ 15 బిలియన్ డాలర్ల కేసు వేశారు.

