అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటివరకు రాజకీయాలతో సంబంధం లేని ఓ బడా వ్యాపారవేత్తగానే పేరున్న ట్రంప్ ఇప్పుడేకంగా అగ్రరాజ్యమైన అమెరికాకు అధ్యక్షుడు అయ్యారు. అధ్యక్ష పదవి కోసం డెమొక్రటిక్ పార్టీ తరపున బరిలో నిలిచిన హిల్లరి క్లింటన్‌పై రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ట్రంప్ ఎట్టకేలకు తను అనుకున్నది సాధించి వైట్ హౌజ్‌కు రాజయ్యారు.
డొనాల్డ్ ట్రంప్ మీడియాపై నిప్పులు చెరిగారు. ఈ భూమ్మీద అత్యంత నిజాయితీలేని మనుషులు ఎవరన్న ఉన్నారంటే వారు జర్నలిస్టులేనని ధ్వజమెత్తారు ఆయన. గత కొంతకాలంగా మీడియాతో తాను యుద్ధం చేస్తున్నానని, వారు అవాస్తవాలను ప్రసారం చేస్తుంటే హెచ్చరిస్తూ వస్తున్నానని చెప్పారు ట్రంప్. తత్ఫలితంగా తన ప్రమాణ స్వీకారానికి చాలా తక్కువ మంది వచ్చినట్లు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని మీడియాను హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు.
‘నేను ప్రమాణం చేస్తుండగా ముందు పెద్ద ప్రజాసమూహం ఉంది. అది మీరు కూడా చూశారు. మొత్తం నిండిపోయింది. అయితే నేను ఈ రోజు ఉదయం లేచి ఓ మీడియా నెట్ వర్క్ పరిశీలించాను. అందులో వారు జనాలు ఉన్నప్రదేశాన్ని విడిచిపెట్టి ఖాళీ చోటును చూపించారు. వాస్తవానికి మాట్లాడే సమయంలో ఒకసారి నేనంతా పరిశీలించాను.. దాదాపు మిలియన్ నుంచి మిలియన్నరమంది హాజరయ్యారు. కానీ మీడియా మాత్రం ఖాళీ స్థలాలను చూపించింది’ అని మీడియాపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ట్రంప్.
ఈ శుక్రవారం అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డోనాల్డ్ ట్రంప్ ఓ అధికారిక డాక్యుమెంట్‌పై తొలి సంతకాన్ని చేశారు. అయితే, ట్రంప్ సంతకంపై ట్విట్టర్‌లోనెటిజన్లు వ్యంగాస్త్రాలు సందిస్తున్నారు. ట్రంప్ సంతకాన్ని కొందరు సిస్మోగ్రాఫ్‌తో పోల్చగా.. మరికొందరు లై డిటెక్టర్ టెస్టు చార్ట్‌గా.. ఇంకొందరు సౌండ్ ఫ్రీక్వెన్సీతో పోల్చుతున్నారు. కాగా, ట్రంప్ చేసిన సంతకం ఆటోగ్రాఫ్‌లా ఉందని చేతిరాత నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఆయన సంతకం కోపం, భయాలను సూచిస్తోందని ఓ చానెల్ నిర్వహించిన ఇంటర్వూలో పేర్కొన్నారు.
ట్రంప్ సంతకంపై నెటిజన్లు వ్యంగాస్త్రాలు