ఆ దేశాలపై 25 శాతం సుంకం:ట్రంప్

5
- Advertisement -

ఇరాన్‌పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో, ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాతో చేసే అన్ని వ్యాపారాలపై 25 శాతం టారిఫ్ (సుంకం) విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా దాడులు చేసి దాదాపు 600 మంది మృతి చెందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని, ఈ ఆదేశం తుది మరియు ఖరారైనదని ట్రంప్ స్పష్టం చేశారు.

సోమవారం సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ట్రంప్..తక్షణమే అమల్లోకి వచ్చేలా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాతో చేసే ప్రతి వ్యాపారంపై 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆదేశం తుది నిర్ణయం అని పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై ప్రాణాంతక బలాన్ని ఉపయోగిస్తోందని తేలితే సైనిక చర్యలు తప్పవని ట్రంప్ గతంలోనే పలుమార్లు హెచ్చరించారు.

భారత్‌, చైనా, బ్రెజిల్‌, టర్కీ, రష్యా వంటి దేశాలు ఇరాన్‌తో వ్యాపారం చేసే ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి. ఈ నిర్ణయం భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికాకు చేసే భారత దిగుమతులపై 50 శాతం వరకు సుంకాలు ఎదురవుతున్నాయి. ఇందులో రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించిన 25 శాతం కూడా ఉంది అని వాషింగ్టన్ వాదిస్తోంది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, భారత్–ఇరాన్ మధ్య వాణిజ్య సంబంధాలు కీలకమైనవి. గత కొన్నేళ్లుగా ఇరాన్‌కు భారత్ టాప్ ఐదు వ్యాపార భాగస్వాముల్లో ఒకటిగా ఉంది. భారత్ నుంచి ఇరాన్‌కు బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, మానవనిర్మిత ఫైబర్లు, ఎలక్ట్రికల్ యంత్రాలు, కృత్రిమ ఆభరణాలు ఎగుమతి అవుతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్‌, అజైవ–సజైవ రసాయనాలు, గ్లాస్‌వేర్ వంటి వస్తువులు భారత్ ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది.

Also Read:KTR:కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు

ఇదిలా ఉండగా, ఇరాన్ వాషింగ్టన్‌తో చర్చలు జరపాలని కోరుకుంటోందని ట్రంప్ తెలిపారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “చర్చల కోసం సమావేశం ఏర్పాటు అవుతోంది. కానీ పరిస్థితులను బట్టి సమావేశానికి ముందే చర్యలు తీసుకోవాల్సి రావచ్చు. ఇరాన్ మమ్మల్ని సంప్రదించింది, చర్చలు కోరుతోంది” అని చెప్పారు. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం, ఆర్థిక ఇబ్బందులు, పాలనపై అసంతృప్తితో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అజర్‌బైజాన్ ప్రావిన్స్‌, ఆరక్ నగరం సహా పలు ప్రాంతాల్లో భారీ ప్రదర్శనలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

- Advertisement -