రాహుల్ గాంధీని ప్రత్యర్థి పార్టీలు ఎన్ని రకాలుగా వెటకారంగా వెక్కిరిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ…. ఇటు పార్టీ అధికారంలో ఉన్న సమయంతో పాటు 2014 నుండి ప్రతిపక్ష పార్టీలోనూ కీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆయన అనుసరిస్తున్న విధానాలు, తన మెచ్యూరిటీ చర్చనీయాంశంగానే మారుతూ ఉంటుంది. తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. రైతు సంఘర్షణ సభ పేరుతో ఆ పార్టీ సభ ఏర్పాటు చేసింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఓదార్చటంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయాలో చెప్పటం ఆ సభ ముఖ్య ఉద్దేశం. పైగా ఈ సభ ప్రోగ్రాం ఫిక్స్ అయి చాలా రోజులు అవుతుంది. దీంతో రాహుల్ గాంధీ వంటి నేతకు టూర్ స్టార్ట్ అయ్యే ముందే పార్టీ నుండి, తన వ్యక్తిగత సిబ్బంది నుండి అన్ని వివరాలు అందాల్సి ఉంటుంది.
మీటింగ్ ఎక్కడ, ఏయే ఇష్యూస్ టార్గెట్ చేయాలి, లోకల్ సర్కార్ పనితీరు, అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వారి ఫెయిల్యూర్స్ ఏంటీ… మనం ఏం చేయగలం, మన హామీలు ఎలా ఉంటే రైతులకు నచ్చుతుంది అన్న అంశాలపై పూర్తిగా స్టడీ చేయాల్సి ఉంటుంది. పెద్ద నాయకులంతా ఇదే చేస్తుంటారు. ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర పార్టీ కీలక నేతలతో మాట్లాడి సదరు రాష్ట్రంలో ల్యాండ్ సమయానికి ఓ అవగాహనకు వస్తారు. కానీ, రాహుల్ గాంధీ టూర్ అలా జరగలేదు. రాహుల్ గాంధీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు చెప్పండి అక్కడ నేనేం మాట్లాడాలి, ఏయే అంశాలు ప్రస్తావించాలంటూ స్థానిక నేతలను అడిగారు. ఆ సంభాషణ పూర్తిగా కాంగ్రెస్ నాయకులు మీడియా కోసం తీసిన వీడియోల్లో రికార్డ్ అయ్యింది.
ఇంకేముంది రాహుల్ గాంధీకి తోడు లోకల్ నాయకుల అజాగ్రత్త ఇప్పుడు రాహుల్ ను ట్రోల్ చేసే వరకు వెళ్లింది. ఏం తెలియకుండా రైతుల సభ అని పేరు పెట్టడం దేనికి, కనీస అవగాహన లేకుండా జాతీయ నాయకులు ఎలా అవుతారు అని మండిపడుతున్నారు. ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని ఇటు టీఆర్ఎస్ కూడా రాహుల్ పై మండిపడింది. మీ మాటలే రైతుల పట్ల మీ చిత్తశుద్ధిని చూపించాయని, మీరు ఎలాంటి వారో తెలుసు కాబట్టే వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ మిమ్మల్ని ఈడ్చి తన్నిందంటూ మంత్రి హరీష్ రావు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పొలిటికల్ టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు… కేసీఆర్ మాత్రమే ఇక్కడ లోకల్, ఆయన మాత్రమే ఇక్కడి ప్రజల కష్టసుఖాలను బట్టి పనిచేస్తారంటూ మంత్రి కేటీఆర్ లు కామెంట్ చేశారు.