యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఇవాళ జాతీయ రహదారుల దిగ్బందానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ ముంబై జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం. మహిపాల్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున రైతులు,టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి.
కేంద్రం ధాన్యం కొనుగోలు చేపట్టేవరకు ఆందోళన చేపడతామని తెలిపారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి. పంజాబ్ తరహాలోనే తెలంగాణలోనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నది. బీజేపీ నాయకులు తలా తోకా లేకుండా మాట్లాడుతుండగా, కేంద్రం రోజుకో కొర్రీ పెడుతూ.. ప్రస్తుత యాసంగి వడ్ల కొనుగోలుపై దాటవేస్తూ వివక్ష చూపుతున్నది. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ కార్యచరణ ప్రకటించగా ఈ నెల 11న ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనుంది.