శనివారం హన్మకొండలో వరంగల్- ఖమ్మం- నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం కోసం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఆరెఎస్ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాల మల్లు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే కొందరు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి అబద్ధాలు వల్లె వేస్తున్నారు. అలాంటి వాళ్ళ కు మనం బుద్ధి చెప్పాలి. తగిన సమాధానం చెప్పాలి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా చెప్పిన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు సాధించుకున్నాం. దేశ సగటు, తలసరి ఆదాయం కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం డబుల్ అయ్యింది. మనం మన రాష్ట్రాన్ని బికారి చేయడం కాదు. బికారి, భిమారి రాష్ట్రాలను మనమే అదుకుంటున్నం. పన్నులు కూడా మనమే దేశానికి ఎక్కువ కడుతున్నమని పల్లా తెలిపారు.
రాష్ట్రంలో లక్షా 32 వేల 899 ప్రభుత్వ, 14లక్షల ప్రైవేట్ ఉద్యోగాలను సాధించుకున్నాం. బిజెపి చెప్పిన ఉద్యోగాలు… మన ఖాతాల్లో చేరతాయన్న 15 లక్షలు పడ్డాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షలాది మందికి వివిధ శాఖల వాళ్లకు 300 శాతం వరకు జీతాలు పెంచాం..మరో 50వేల ఉద్యోగాలు రానున్నాయి..నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ శిక్షణ కూడా అందిస్తున్నాం. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా అనేక సమస్యల పరిష్కారంలో కీలకంగా పని చేసిన.. మళ్ళీ అవకాశం ఇస్తే, మరింతగా కృషి చేస్తాను అని రాజేశ్వర్ రెడ్డి కోరారు. ఈ ప్రాంత పోరాటాలు, త్యాగాలు, విజయాలు, కష్టాలు, నష్టాలు మావి, బీజేపీకి సంబంధం లేదన్నారు. ప్రశ్నించే గొంతులతో ఏమి జరగదు. పరిష్కరించే చేతులు కావాలి.తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలు, ఓటర్లదే అన్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి ని బంపర్ మెజారిటీతో గెలిపించుకోవాలి. ఆ బాధ్యతను ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త తమ భుజాలపై ఎత్తుకోవాలి. బూత్ ల వారీగా, ప్రతి ఓటరు ని కలిసి, మనం ఓటు వేయడమే కాదు, మిగతా వాళ్ళతో ఓట్లు వేయించాలి. మొదటి ప్రాధాన్యత ఓటును పల్లా రాజేశ్వర్ రెడ్డికి వేసి గెలిపించాలన్నారు.
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మార్చి 14 న జరిగే ఎన్నికల్లో మనం మన అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓట్లు వేసి మంచి మెజారిటీ తో గెలిపించుకోవాలి. సీఎం కెసిఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టుదల గల మనిషి. తెలంగాణ ఉద్యమం, పోరాటం, త్యాగాలు, అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఏమీ లేదు. మీరేం చేశారని…మీరు చేసిందేమిటి? ప్రజలకు వివరించి ఓట్లకు బీజేపీ రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి, వరంగల్ జిల్లాకు కేంద్రం తీవ్ర నష్టాలు, అన్యాయం కలిగించింది. విభజన చట్టం మొదలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం చిల్లి గవ్వా విదల్చలేదు. అలాంటి వాళ్ళు మన దగ్గరకు ఓట్ల కోసం వస్తే నిలదీయాలి. బిజెపి, కాంగ్రెస్ లాంటి వాళ్లకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కడియం విమర్శించారు.

