యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు మంత్రి నిరంజన్ రెడ్డి.వ్యవసాయిక దేశమైన భారతదేశాన్ని పరిపాలించే ఏ ప్రభుత్వమైనా రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కొమ్ముగాస్తూ వ్యవసాయాన్ని క్రమంగా కార్పొరేట్ శక్తుల పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో గుణాత్మక మార్పుకు దారితీసే ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదు. రైతు సంక్షేమం కోసం కేంద్రం తానేమీ చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి విఘాతాలు సృష్టిస్తున్నది. ఇందుకు మన రాష్ట్రమే ఉదాహరణ.
తెలంగాణా ప్రభుత్వం వ్యవసాయ పునరుజ్జీవనానికి గత ఎనిమిది సంవత్సరాలలో ఎన్నో నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. అపూర్వమైన ఫలితాలను సాధించింది. దేశం ఆశ్చర్యపోయే విధంగా వ్యవసాయ రంగంలో పురోగతిని సాధించింది. వరి ఉత్పత్తిలో నేడు తెలంగాణా రాష్ట్రం, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో కరువు కాటకాలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ. స్వరాష్ట్రంలో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిందన్నారు. ముఖ్యమంత్రి నిత్య తపన, నిరంతర మేధోమథనం, కఠోర తపస్సు తెలంగాణ వ్యవసాయం తీరుతెన్నులను మార్చేసింది. సమైక్య పాలకులు చూపిన దారుణ వివక్ష వల్ల తెలంగాణ వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆనాడు అనేక సమస్యలతో రైతులు అల్లాడిపో యారు. చివరికి బతుకుమీది ఆశను సైతం కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుదలతో గొప్ప కృషి చేసి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆవరించి ఉన్న అనేక జటిల సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించారు. దీంతో రాష్ట్ర రైతాంగంలో నూతనోత్తేజం నెలకొన్నది. బలమైన విశ్వాసం పాదుకొన్నది.వ్యవసాయానికి శాపంగా పరిణమించిన కరెంటు కోత, సాగునీటి కొరతలను తెలంగాణ రాష్ట్రం అనతికాలంలో అధిగమించింది. సమృద్ధి దిశగా పురోగమించింది. నేడు దేశంలో ఇరవై నాలుగు గంటలపాటు వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రైతులకు కరెంటుపై ఇస్తున్న సబ్సిడీ కోసం ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం 87 వేల 421 కోట్లు ఖర్చు చేసింది.తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల రంగానికి పెద్దపీట వేసి, కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. గత ప్రభుత్వాలు అసంపూర్తిగా వదిలేసిన పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం భారీ బహుళార్థ సాధక ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, రికార్డు సమయంలో పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని శరవేగంగా సాగిస్తున్నది. సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్లలో 1 లక్షా 25 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి వాటిని ప్రాజెక్టులతో అనుసంధానం చేసింది. ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు చేసింది. దీంతో చెరువుల్లోనూ, చెక్ డ్యాముల్లోనూ నీటి నిల్వ సామర్థ్యం పెరగటంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. సాగునీటి కొరత తీరింది. ఎండాకాలం లో సైతం చెరువులు మత్తడి దుంకుతుంటే, వాగులు వంకలూ పొంగి పొరలుతున్న అపురూప దృశ్యాలకు తెలంగాణ వేదికయింది. కరవు, కాటకం అనే పదాలు జనజీవితం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాయి. సజీవ జలధారలతో సస్యశ్యామల తెలంగాణ ఆవిష్కృతమైందన్నారు. మొదటి పర్యాయం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే 95.2 లక్షల మంది రైతులకు సంబంధించిన 18, 144 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి రైతులలో విశ్వాసం పెంపొందించింది. రెండవ పర్యాయం అధికారం లోకి వచ్చిన తరువాత కూడా 5.12 లక్షమంది రైతులకు సంబంధించిన వ్యవసాయ రుణాలు మాఫీ చేసింది. మిగతా రైతుల మాఫీ ప్రక్రియ పురోగతిలో వుంది. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణాల మాఫీ కోసం 22,224 కోట్లు వెచ్చించిందన్నారు.
పంటకాలంలో రైతులకు పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం ఎకరానికి పదివేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తూ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం తెలంగాణ వ్యవసాయం స్వరూపాన్నే మార్చేసింది. ఈపథకం యావద్దేశానికి దిక్సూచిగా నిలిచింది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు రాష్ట్ర రైతాంగానికి 65,391 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేసింది.రైతు కుటుంబాల ఆర్ధిక భద్రత కోసం అమలు చేస్తున్న రైతుబీమా కొండంత ధీమానిస్తున్నది. రైతు బీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 5,755 కోట్లు వెచ్చించిందన్నారు.రైతు సంక్షేమంతో పాటూ వ్యవసాయ శాఖను బలోపేతం చేసే చర్యలెన్నో ప్రభుత్వం చేపట్టింది. ప్రతీ ఐదు వేల ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్ గా విభజించి ప్రతీ క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించింది. తద్వారా రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు సలహాలు అందించి మార్గనిర్దేశనం చేస్తున్నది. వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. ఫాం మెకనైజేషన్ కోసం ఈ ఎనిమిదేళ్లలో 1775 కోట్ల 93 లక్షల రూపాయలు ఖర్చుచేసిందన్నారు.
ఎనిమిదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం మొత్తం 3 లక్షల 7 9 వేల 5 కోట్లు ఖర్చు చేసింది.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యల ఫలితంగా భారతదేశ సాగు విస్తీర్ణంలో తెలంగాణ వాటా 2.93 శాతం నుంచి 4.84 శాతానికి పెరిగింది.2014లో 1 కోటి 22 లక్షల ఎకరాలున్న రాష్ట్ర సాగు విస్తీర్ణం 2021 నాటికి 2 కోట్ల 19 లక్షల ఎకరాలకు పెరిగింది.అంటే ఎనభై శాతం గణనీయమైన పెరుగుదలను సాధించింది. అదే సమయం లో 2014లో 99 లక్షల టన్నుల వరి ఉత్పత్తి ఉండగా, 2021 నాటికి 2 కోట్ల 59 లక్షల టన్నులకు పెరిగింది. ఇది చరిత్రలో ఎన్నడూ ఎవరూ సాధించని ఘనమైన అభివృద్ధి.
వ్యవసాయ రంగంలో తెలంగాణా సాధించిన అద్భుతమైన ప్రగతిని చూసి అభినందించి, ప్రోత్సహించి సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి. వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్రం ప్రవేశపెట్టిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం భగ్గున మండింది. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఎండా, వానా, చలీ దేన్నీ లెక్కచేయకుండా ఏడాదికి పైగా కాలం గొప్ప పోరాటం చేశారు. రైతుల పోరాటానికి తలొగ్గిన కేంద్రం నల్లచట్టాలను వెనక్కి తీసుకున్నది. స్వయంగా ప్రధానమంత్రి మోడీ చెంపలు వాయించుకొని దేశ రైతాంగానికి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం కొని తెచ్చుకుందన్నారు.
ఇంత జరిగినా కేంద్ర ప్రభుత్వం తన రైతు వ్యతిరేక వైఖరిని మార్చుకోవడం లేదు. ఇటీవలి బడ్జెట్లో సైతం ఎరువుల సబ్సిడీపై 35 వేల కోట్లు కోత విధించింది. దీనివల్ల కొన్నిరకాల ఎరువుల ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి. కేంద్రం దినదినం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుండటంతో వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు పెరిగిపోయి తడిసి మోపెడవుతున్నది.కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేవి కావడం వల్ల తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదు. కేంద్రం కుటిల నీతితో విద్యుత్ సంస్కరణలకు, ఎఫ్.ఆర్.బి.ఎం పెంపుదలకూ లంకె పెట్టి రాష్ట్రం మెడమీద కత్తి పెట్టింది. విద్యుత్ సంస్కరణలకు అంగీకరిస్తే బాయిల కాడ మోటార్లకు మీటర్లు పెట్టాలె. అంగీకరించకపోతే ఏటా 5 వేల కోట్ల రూపాయలు నష్టపోవాలె. ఏదేమైనా సరే,బాయిల కాడ మీటర్లు పెట్టకూడదని, రైతుల మీద కరెంటు చార్జీల భారం వెయ్యకూడదని రాష్ట్ర ప్రభుత్వం స్థిరమైన నిర్ణయం తీసుకున్నది. మా కంఠంలో ప్రాణంఉండగా రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోం అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుండ బద్దలు కొట్టినట్టు కేంద్రానికి తెలియజేశారు. నాలుగు కోట్ల ప్రజల శ్రేయస్సు కోసం 25 వేల కోట్ల రూపాయలు వదులుకోవడానికి సిద్ధపడ్డారు. రైతుల ప్రయోజనాల పట్ల ముఖ్యమంత్రి గారికున్న సంపూర్ణ నిబద్ధతకు ఇది తార్కాణం.ఇన్నివిధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతూ వచ్చిన కేంద్రం, వీటికి తోడు యాసంగిలో ధాన్యం సేకరించే విషయంలోనూ రకరకాల మెలికలు పెట్టి చివరికి బాధ్యతారాహిత్యంతో చేతులెత్తేసింది. తన క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని, తద్వారా దేశ ప్రగతిని కూడా దెబ్బతీసే నికృష్ణ ధోరణిని ప్రదర్శిస్తున్నది. ఆహార భద్రతా చట్టం ప్రకారం ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత. అందుకోసమే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. దేశంలో ఆహార కొరత రాకూడదంటే రెండు, మూడు సంవత్సరాలకు సరిపోయే స్థాయిలో నిరంతరం ఆహార నిల్వలుండాలి. బాధ్యతాయుత ప్రభుత్వంగా ఉండాల్సింది పోయి, వ్యాపార సంస్థ మాదిరిగా ధాన్యం సేకరణను లాభనష్టాల ప్రాతిపదికన చూడటం బీజేపీ ప్రభుత్వం దౌర్భాగ్య పోకడలకు నిదర్శనం అన్నారు.
తెలంగాణలో యాసంగి పంట ఏప్రిల్, మే నెలలలో కోతకు వస్తుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటం వల్ల గింజ పగులుతుంది. మిల్లింగ్ చేసినప్పుడు నూకలశాతం అధికంగా ఉంటుంది. వానాకాలం పంటతో వచ్చే వడ్లు మిల్లింగ్ చేస్తే క్వింటాలుకు దాదాపు 50 కిలోలకు పైన బియ్యం వస్తాయి. కాగా యాసంగిలో వచ్చే వడ్లు మిల్లింగ్ చేస్తే క్వింటాలుకు 38 నుండి 35 కిలోల బియ్యం మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ నష్టం అధిగమించటం కోసం యాసంగి వడ్లను పార్ బాయిల్డ్ రైస్ గా మార్చి ఇవ్వటం అనేది కేంద్ర సర్కారు సూచనల మేరకే అనేక దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్నది. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం పార్ బాయిల్డ్ రైస్ సేకరించకూడదని హఠాత్తుగా దిక్కుమాలిన నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యలేవీ తీసుకోకుండా ప్రకటించిన ఈ ప్రతికూల నిర్ణయం తెలంగాణ రైతాంగానికి శరాఘాతంగా పరిణమించింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రివర్గ ప్రతినిధులు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి ఈ నిర్ణయం మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖా మంత్రి పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి చేశారు.
కేంద్రం సానుకూలంగా స్పందించక పోవటంతో విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైతులను వరిపంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్ళించే ప్రయత్నాల్ని ప్రారంభించారు. అటు కేంద్రంలోని బీజేపీ సర్కారు ధాన్యం సేకరించక సతాయిస్తుంటే, ఇక్కడ రాష్ట్ర బిజెపి నాయకులుతమ ప్రభుత్వ నిర్ణయానికి తామే విరుద్ధంగా ప్రవర్తిస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న
ప్రయత్నాలకు అడ్డు తగిలారు. రైతులు యాసంగిలోనూ వరిసాగే చేయాలని, పండిన ప్రతి గింజనూ తామే కొంటామని బాధ్యతా రహితంగా ప్రకటనలు చేశారు. దుర్మార్గ ప్రేలాపనలతో రైతులను తప్పుదోవ పట్టించి, గందరగోళాన్ని సృష్టించారు. రాష్ట్ర బిజెపి నాయకులు సృష్టించిన ఈ గందరగోళం వల్ల కొంతమంది రైతులు యాసంగిలోనూ వరి సాగుచేశారు.బీరాలెన్నో పలికిన బీజేపీ నాయకులుపంట చేతికి వచ్చే సమయానికి చేతులెత్తేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచారు. దొంగే.. దొంగా దొంగా అని అన్నట్లు తాము చేసిన దుర్మార్గానికి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపారు. తెలంగాణ రైతుల బతుకులతో చెలగాటమాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై అపనిందలు వేసి, రాజకీయ లబ్ది పొందాలనే నీచమైన ఎత్తుగడలకు పాల్పడ్డారు.
తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు కాపాడాలనే తపనతో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరోమారు మంత్రులు, పార్లమెంటు సభ్యుల బృందాన్ని రైతుల పక్షాన ఢిల్లీకి పంపించారు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పరిస్థితిలోని గంభీరతను అర్ధం చేసుకోకపోగా, తెలంగాణ ప్రజలకు నూకలు తినటం అలవాటు చేయాలని వెటకారంగా, అవమానకరంగా, అహంకార పూరిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో పోరాటానికి దిగింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు మొదలుకొని జిల్లా పరిషత్ ల వరకు అన్ని ప్రజాస్వామిక వ్యవస్థ యాసంగిలో పండిన వడ్లు కేంద్ర సర్కారు కొనాలని తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాయి. కేంద్ర వైఖరిని నిరసిస్తూ రైతులు తమ ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వం లో ఢిల్లీలో సైతం టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ధర్నా చేసారు. అయినప్పటికీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కేంద్రం ఏమాత్రం స్పందించలేదు. పిడికెడు మంది కార్పొరేట్ పెట్టుబడిదారులకు లక్షల కోట్లలో రుణ మాఫీ చేసే కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల రైతు కుటుంబాల సంక్షేమం కొరకు ఐదారు వేలకోట్లుఖర్చు చేసేందుకు ససేమిరా అనటం సిగ్గుచేటు. దీంతో మోడీ ప్రభుత్వం ప్రాధాన్యతలేమిటో దేశానికి తేటతెల్లమయింది. గతంలో వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి రైతుల చేతిలో భంగపడి, క్షమాపణలు చెప్పిన మోడీ ప్రభుత్వం, ఇప్పటికీ ఇంకా బుద్ధి తెచ్చుకోలేదనీ, రైతు వ్యతిరేక విధానాన్ని మార్చుకోలేదని మరోసారి రుజువయ్యింది.
ధాన్యం మార్కెట్లకు తరలివచ్చే తరుణంలో మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపింది. అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను కాపాడాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాసంగిలో పండిన వరి పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. నూకలు ఏర్పడటం ద్వారా వచ్చే నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధపడింది. రైతులు ఎవరూ తక్కువ ధరకు తమ ధాన్యం అమ్ముకోవాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరనిచ్చి చివరి గింజ వరకూ కొంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. సమస్య కేంద్రం సృష్టించినప్పటికీ, భారాన్ని తమ నెత్తిన వేసుకొని, రైతుల్లో భరోసా నింపారు.యాసంగి పంటను రాష్ట్రప్రభుత్వమే కొనుగోలుచేయాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ టీఆర్ఎస్ విస్తృతసభ తీర్మానిస్తున్నది. తాను రైతుబిడ్డననీ, వ్యవసాయాన్ని అమితంగా ప్రేమించే రైతుననీ, రైతుల సంక్షేమమే తన పరమావధి అనీ నిరూపించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనస్పూర్తిగా నేటి టిఆర్ఎస్ ప్లీనరీ అభినందిస్తుందన్నారు.