తెలంగాణ రాష్ట్రంలో భారీ పరిపాలన సంస్కరణలు చేపట్టామని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. టీఆర్ఎస్ ప్లీనరీలో పాలన సంస్కరణలు, ప్రజల ముంగిట్లో పాలన అనే తీర్మాన్ని ప్రవేశ పెట్టిన పల్లా …తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటమే గొప్ప పాలన సంస్కరణ అని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. పరిపాలన సంస్కరణలో భాగంగా 31 జిల్లాలను ఏర్పాటుచేసి ప్రజల ముంగిటకు పాలన తీసుకొచ్చామని చెప్పారు. 68 రెవెన్యూ డివిజన్లు,585 మండలాలలతో పాలన సాగిస్తున్నామన్నారు.
తెలంగాణ ఏర్పడితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని నక్సల్స్ సమస్య పెరుగుతుందని మాట్లాడారని కానీ నేడు అన్ని సమస్యలను అధిగమించామని తెలిపారు. తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేశామన్నారు.
మున్సిపాలిటీలు,కార్పొరేషన్‌లు కొత్తగా ఏర్పాటు చేసి భారీ పాలన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, జనాభాకు అనుగుణంగా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. పరిపాలన వికేంద్రికరణతో ప్రజల మన్ననలు పొందామన్నారు.
కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామన్నారు పల్లా. కొత్తగా 4500 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామన్నారు. గత నాలుగు సంవత్సరాలలో అన్నిరంగాల్లో తెలంగాణ మోడల్ స్టేట్‌గా నిలిచిందన్నారు. ఇలాంటి పాలన సంస్కరణలు తీసుకొచ్చిన కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. పల్లా రాజేశ్వర్ ప్రవేశపెట్టిన పాలన సంస్కరణలు, ప్రజల ముంగిట్లో పాలన తీర్మానాన్ని ఎంపీ జితేందర్ రెడ్డి బలపర్చగా ప్రతినిధులు చప్పట్లతో అమోదంతో తెలిపారు.