టీఆర్ఎస్ తెలంగాణ సాధించిన పార్టీ అని…కాంగ్రెస్ 7 దశాబ్దాలుగా తెలంగాణను దోచుకుంటున్న పార్టీ అని తెలిపారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ప్లీనరీలో అధ్యక్ష ఉపన్యాసం చేసిన కేసీఆర్..ఆత్మవిశ్వాసంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ బిడ్డగా దేశానికి దారిచూపుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీల అసమర్థత వల్లే దేశంలో నీటి యుద్దాలు జరుగుతున్నాయని తెలిపారు. కర్ణాటక,తమిళనాడు మధ్య ఉన్న కావేరి నది సమస్యను ఇప్పటివరకు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. నిజాయితీ ఉంటే తానడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
టీఆర్ఎస్ పార్టీని,ఉద్యమాన్ని ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తిచేసుకున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. జలదృశ్యంలో ఏప్రిల్ 21 పార్టీ స్ధాపించినప్పుడు ఎన్నో అనుమానాలు,చీత్కారాలు చూశామని కానీ అందరి అనుమానులను పటాంపంచలు చేస్తూ అప్రతిహతంగా మిశ్రమ ఫలితాలను ఎదుర్కొన్ని ఆత్మవిశ్వాసంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని తెలిపారు.
తెలంగాణ తెచ్చింది,సృష్టించింది గులాబీ జెండా అని మర్చిపొవద్దని ప్రతిపక్షాలకు సూచించారు కేసీఆర్. ప్రతిపక్ష నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగతి భవన్‌లో 150 రూమ్‌లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని … 15 గదుల కంటే ఎక్కువగా ఉంటే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని లేకుండా ఆయన ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ నరేంద్ర మోడీ ఏజెంట్ అని రాహుల్ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రులు తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రశంసించారని గుర్తుచేశారు. 2014లో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నేరవేర్చామని స్పష్టం చేశారు సీఎం.
2014 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల్లో బరిలోకి దిగిన మనకు ప్రజలకు పూర్తి మెజారిటీని అందించారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయలేదని తెలిపారు. నితీగా నిజాయితీగా పనిచేస్తున్నామని తెలిపారు సీఎం. అవినీతికి తావు లేకుండా పనిచేసే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. అనేక రాష్ట్రాల ముఖ్య మంత్రులు, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారని తెలిపారు.
పారదర్శకంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. 4 వేల తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత టీఆర్ఎస్‌కే దక్కిందన్నారు. పరిపాలన సంస్కరణలో భాగంగా 31 జిల్లాలను ఏర్పాటుచేశామని తెలిపారు. మాజీప్రధానమంత్రి దేవే గౌడ తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రశంసించారని…కర్ణాటకలో కూడా మీ పథకాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారన్నారు. ప్రభుత్వ పథకాలకు టీఆర్ఎస్ కార్యకర్తలే ఆక్సిజన్ అన్నారు.
అంగన్ వాడీలు,ఆశా వర్కర్లు,హోంగార్డులకు ఎక్కువ జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. మే 10 నుంచి రైతులకు పెట్టుబడి అందించే రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.