ప్లీనరీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు సీఎం కేసీఆర్ సహా ప్రతినిధులంతా మౌనం వహించారు. అంతకుముందు ప్లీనరీ సభా ప్రాంగాణానికి చేరుకున్న సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ… 2001, ఏప్రిల్ 27న ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ నేటికి 16 వసంతాలు పూర్తి చేసుకుంది. మొత్తం తెలంగాణ ఉద్యమం అహింసా మార్గంలోనే సాగింది. ప్రపంచంలో ఏ ఉద్యమ పార్టీ చేయని విధంగా వివిధ ఉద్యమరూపాలతో అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను ఏకం చేసిన నాయకుడు కేసీఆర్… తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను, చివరకు వండే గిన్నను, తినే కంచాన్ని ఉద్యమరూపంలోకి తీసుకెళ్లారు కేసీఆర్. మన ఆడపడచులు ఇష్టంగా ఆడుకునే బతుకమ్మను, ఎత్తే బోనాలను, కొలిచే కట్ట మైసమ్మను ఉద్యమరూపాలుగా మార్చిన మన నాయకుడి ఉద్యమతీరు నా భూతో నా భవిష్యత్.. అన్నట్టుంది.
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నేరవేర్చిన నాయకుడే.. నేడు రాష్ట్ర అభివృద్ది జెండాను ఎత్తుకోవడం మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం. ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రెండు సంవత్సరాల క్రితం జరిగిన సభ్యత్వం కార్యక్రమంలో ఆనాడు 50 లక్షల సభ్యత్వం తీసుకున్న ప్రజలు.. ఈనాడు 75 లక్షలు సభ్యత్వం తీసుకోవడం అపూర్వం… అద్వీతీయం… సభ్యత్వం తీసుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు.. చేర్పించిన కార్యకర్తలకు ధన్యవాదాలు..
ఎందుకీ అపూర్వ స్పందన అంటే అన్ని వర్గాల ప్రజలు చెప్పే మాట ఒక్కటే… తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావించగానే వృధ్దులు, వితంతువులు, వికలాంగులకు దొరికిన ఆసరా ద్వారా వారందరికీ కేసీఆర్ పెద్ద కొడుకయ్యాడు. సన్నబియ్యంతో కడుపునిండా భోజనం చేస్తున్న హాస్టల్ విధ్యార్థులు, స్కూల్ విధ్యార్థులు, అంగన్‌వాడీలోని తల్లులు, పిల్లలు… ఇవాళ కేసీఆర్‌ను కొలుస్తున్నారు. పెళ్లీడుకొచ్చిన పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ రూపంలో కేసీఆర్ మేనమామ అయ్యాడు.
గతంలో వృత్తిపరంగా తమ బతుకుదేలైన గొల్లకురుమలు, విశ్వకర్మలు, చేపలు పట్టే బెస్త, ముదిరాజ్‌లు… వాళ్లకు వినూత్న పథకాలతో పూర్వ వైభవం కల్పిస్తున్న కేసీఆర్.. వారికి సామాజిక విప్లవకారుడయ్యాడు. చివరగా.. తెలంగాణ వచ్చిన తరువాత రుణమాఫీ చేసి, విత్తనాలు, ఎరువులు ఇచ్చి.. కోతలు లేని కరెంటిచ్చి… ధ్వంసమైన చెరువులు బాగుచేసి.. ఈ మధ్యనే ఆర్తీతో ఎరువుల కోసం.. పెట్టుబడికోసం..ఎకరాలకు రూ. 4వేలు ప్రకటించిన కేసీఆర్‌ని గురించి ప్రతి రైతు ఒక మాట చెబుతున్నాడు. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసుంటదని నానుడి… కానీ ప్రతి బియ్యపు గింజ మీద పండించిన రైతు పేరు ఉంటదని.. ఆ రైతుకు కొండంత అండగా నిలిచిన మా ముఖ్యమంత్రి పేరుంటదని నేను విశ్వసిస్తున్నా.. అని తన ప్రసంగంలో రాజేశ్వర్ రెడ్డి పేర్కోన్నారు.