హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఈ రోజు టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వచ్చే 15 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పూర్తి అవుతుందని కే. కేశవరావు తెలిపారు. మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశానికి 15 మంది సభ్యులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు శేరి సుభాష్‌రెడ్డిని కమిటీ సభ్యుడిగా చేర్చడం జరిగింది.
ఈ సమావేశం అనంతరం కేకే మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో 15 రోజుల్లో రూపకల్పన పూర్తవుతుందన్నారు. మరో నాలుగు సమావేశాలు నిర్వహించి సీఎం కేసీఆర్‌తో చర్చించిన తరువాత మేనిఫెస్టో ప్రకటిస్తమన్నారు. నేటి సమావేశం సందర్భంగా మొత్తం 20 అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. వివిధ వర్గాల నుంచి 170 వరకు వినతులు వచ్చినట్లు తెలిపారు. కొత్తగా ఏఏ అంశాలు చేర్చాలన్న దానిపై కూడా చర్చించినట్లు చెప్పారు. మేనిఫెస్టో ముసాయిదాను నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తామన్నారు.
గత ఎన్నికల మేనిఫెస్టో హామీలను చాలా వరకు నెరవేర్చినట్లు తెలిపారు. వేరే పార్టీలు మేనిఫెస్టో ఏం పెట్టాయన్నది తమకు సంబంధం లేదన్నారు. టీఆర్ఎస్ పరంగా మంచి మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచుతామని కేకే పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు, చందూలాల్, పద్మారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఫరీదుద్దీన్, రాములు, గుండు సుధారాణి పాల్గొన్నారు.