టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల బయోగ్రఫీ..

387
trs mp candidates
- Advertisement -

17 ఎంపీ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. ఏడుగురు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించగా నలుగురు సిట్టింగ్‌లకు మొండిచేయి చూపించారు. పార్టీ విధేయత, విజయావకాశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారుచేశారు సీఎం కేసీఆర్. పార్టీ ఎంపీ అభ్యర్థులుగా ఎంపికైనవారికి బీఫారాలు అందజేశారు.

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు…వివరాలు

()తెలంగాణ జాగృతి-కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు ఎంపీ కవిత. కేసీఆర్‌ కూతురిగానే కాకుండా తన పనితీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కరీంనగర్‌లో జన్మించిన కవిత హైదరాబాద్‌లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలో ఎంఎస్ చేసిన కవిత సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2003లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌ను పెళ్లిచేసుకున్న కవిత 2004లో ఇండియాకు తిరిగివచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతికంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాదు తెలంగాణ పూల పండగ బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా మరోసారి ఇక్కడే నుండే బరిలోకి దిగుతున్నారు.

()బోయినపల్లి వినోద్ కుమార్‌-కరీంనగర్

వరంగల్ జిల్లాకు చెందిన బోయినపల్లి వినోద్‌కుమార్ 1959, జూలై 22వ తేదీన జన్మించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదివి ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. విద్యార్ధి దశ నుండే రాజకీయాలంటే ఆసక్తికనబర్చిన వినోద్ సీపీఐ అనుబంధ ఏఐఎస్‌ఎఫ్‌లో చురుగ్గా పనిచేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గంలో పనిచేశారు. టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరు.కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వినోద్ కుమార్‌ 2004లో హన్మకొండ నియోజకవర్గం ఎంపీగా గెలిచారు. 2008లో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తరువాత జరిగిన ఉపఎన్నికల్లో గెలిపొందారు. 2009లో కరీంనగర్‌లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2014లో అక్కడి నుంచే గెలుపొందారు. ఇటీవల కరీంనగర్ సభలో ఫెడరల్‌ఫ్రంట్ అధికారంలోకి రాగానే వినోద్‌కుమార్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు.

()మన్నె శ్రీనివాస్ రెడ్డి-మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన మన్నె శ్రీనివాస్‌రెడ్డి 1959లో సోమేశ్వరమ్మ, అచ్చిరెడ్డి దంపతులకు జన్మించారు. స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం గురుకుంట. అన్న, ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీ అధినేత సత్యనారాయణరెడ్డి ప్రోద్బలంతో 2004లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ రెడ్డి 2006లో ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. పీఏసీఎస్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

()బొర్లకుంట వెంకటేశ్ నేతకాని-పెద్దపల్లి

కరీంనగర్ జిల్లా మంచిర్యాల జన్నారం మండలం తిమ్మాపూర్‌లో జన్మించారు బొర్లకుంట వెంకటేశ్ నేతకాని. ఎంకాం, ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ(లా) చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రూప్-1 ఉద్యోగాల కోసం యువతకు ఉచిత శిక్షణ అందించారు. 2007లో గ్రూప్-1 అధికారిగా ఎంపికయ్యారు. పదోన్నతిపై డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్‌గా కరీంనగర్‌లో విధులు నిర్వర్తించారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చేరి పెద్దపల్లి ఎంపీగా సీటు దక్కించుకున్నారు.

()కొత్త ప్రభాకర్ రెడ్డి-మెదక్

మెదక్ జిల్లాకు చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దుబ్బాక మండలం పోతారంలో జన్మించిన ప్రభాకర్ రెడ్డి బీఏ వరకు చదివారు. రవాణా రంగంలో విశేష అనుభవం ఉన్న ఆయన 2007లో టీఆర్ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా కేసీఆర్ రాజీనామా చేయడంతో ఆయనకు పోటీచేసే అవకాశం దక్కింది. భారీ మెజార్టీతో మెదక్‌ ఎంపీగా గెలిచిన ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ ఇంఛార్జీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.

()పుస్తె శ్రీకాంత్ – హైదరాబాద్

హైదరాబాద్ పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్‌కు చెందిన పుస్తె శ్రీకాంత్ 1972 నవంబర్ 14న జన్మించారు. 1994 నుంచి క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. శ్రీకాంత్ తండ్రి బాబూరావు 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై టీడీపీ తరపున పోటీచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి గులాబీ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.

()గోడం నగేశ్‌-ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోడం నగేశ్‌ 1964 అక్టోబర్ 21న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎంఈడీ పూర్తిచేశారు. 1989 నుంచి 94 వరకు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన టీడీపీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1994లో బోథ్ అసెంబ్లీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2003 వరకు ఎమ్మెల్యేగా, గిరిజన కోఆపరేటివ్ కార్పోరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయిన 2009లో టీడీపీ నుండి గెలుపొందారు. 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. పార్లమెంట్‌లో బొగ్గు ఖనిజాల స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఉన్నారు.

()బూర నర్సయ్య గౌడ్‌-భువనగిరి

ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యపేటకు చెందిన బూర నర్సయ్య గౌడ్‌ 1959 మార్చి 2న జన్మించారు. డాక్టర్ల జేఏసీ ఛైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ ఆమరణదీక్ష స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2014 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై గెలుపొందారు. భువనగిరికి కేంద్రీయ విద్యాలయం, బీబీనగర్‌కు ఎయిమ్స్ వచ్చేలా కృషిచేశారు. బీఎల్‌ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు.

()తలసాని సాయి కిరణ్‌-సికింద్రాబాద్

మంత్రి తలసాని రాజకీయ వారసుడిగా సికింద్రాబాద్ ఎంపీ సీటు దక్కించుకున్నారు సాయి కిరణ్‌. 1986లో మే 13న జన్మించిన సాయి కిరణ్‌ ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీలో ఎంబీఏ చేశారు. ఆశాకిరణ్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత తలసాని సాయి సేవాదళ్‌ను ప్రారంభించి సనత్‌నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు.

()పోతుగంటి రాములు-నాగర్ కర్నూల్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరుకు చెందిన రాములు 1952లో జన్మించారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో క్రీయాశీలపాత్ర పోషిస్తున్న రాములు మార్కెటింగ్ శాఖలో ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ తరఫున అచ్చంపేట అసెంబ్లీకి పోటీచేసి వరుసగా 1994, 1999, 2004లో గెలుపొందారు. చంద్రబాబు మంత్రివర్గంలో క్రీడలశాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన నాగర్‌ కర్నూల్ స్ధానాన్ని దక్కించుకున్నారు.

()రంజిత్ రెడ్డి-చేవెళ్ల

వరంగల్ జిల్లాకు చెందిన రంజీత్ రెడ్డి 1964 సెప్టెంబర్ 18న జన్మించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వెటర్నరీ సైన్స్‌లో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ విద్యనభ్యసించారు. పౌల్ట్రీ పరిశ్రమలో టెక్నికల్ అడ్వయిజర్‌గా కెరీర్‌ను ప్రారంభించి అనంతరం పౌల్ట్రీరైతుగా ఎదిగారు. 1996లో ఎస్సార్ హేచరీస్ సంస్థను ప్రారంభించారు. తెలంగాణ పౌల్ట్రీ, బ్రీడర్స్ అసొసియేషన్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించడంతోపాటు, ఆర్వీ మెడికల్ కళాశాల, ఎంఆర్ మెడికల్ కళాశాలలకు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2004లో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన పార్టీ బలోపేతానికి కృషిచేశారు.

()వేమిరెడ్డి నర్సింహారెడ్డి-నల్గొండ

నల్లగొండ జిల్లాకు చెందిన వేమిరెడ్డి నర్సింహారెడ్డి మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో 1955లో జన్మించారు. హెచ్‌ఎంటీ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. 1997 నుంచి స్నేహిత అగ్రి బయోటెక్ ఎండీగా కొనసాగుతున్నారు. 2012 నుంచి వీజీఎస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆయన టీఆర్‌ఎస్‌లో కొసాగుతున్నారు.

()మాలోతు కవిత-మహబూబాబాద్

తండ్రి రెడ్యానాయక్ రాజకీయ వారసురాలిగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మాలోతు కవిత. మరిపెడ మండలం ఉగ్గంపల్లిలో 1979లో జన్మించిన కవిత 2009లో మహబూబాబాద్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ కార్యదర్శిగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగుతున్నారు.

()మర్రి రాజశేఖర్ రెడ్డి-మల్కాజ్ గిరి

మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్‌రెడ్డి 1976 జూన్ 17న జన్మించారు. విద్యావేత్తగా సుపరిచితుడు. బోయిన్‌పల్లిలో పుట్టి పెరిగిన ఆయన, బీకాం విద్యనభ్యసించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చైర్మన్‌గా, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వైస్‌చైర్మన్‌గా, సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించారు.

()బీబీ పాటిల్-జహీరాబాద్

కేసీఆర్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు ఎంపీ బీబీ పాటిల్. కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలం సిర్పూర్ గ్రామంలో 1955లో జన్మించిన బీంరావు బసంత్ రావు పాటిల్ అగ్రికల్చర్ బీఎస్పీ చేశారు. వ్యాపారరంగంలో మంచిగుర్తింపు తెచ్చుకున్న ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. అప్పటినుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం విశేషంగా కృషిచేస్తున్నారు.

() పసునూరి దయాకర్-వరంగల్

వరంగల్ జిల్లాకు చెందిన పసునూరి దయాకర్ 1967లో జన్మించారు. 2001లో టీఆర్ఎస్‌లో చేరిన పసునూరి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.2001లో వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా, 2009లో వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2015లో కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటిచేసిన పసునూరి దయాకర్ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందారు.

()నామా నాగేశ్వర్‌రావు-ఖమ్మం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంకు చెందిన నామా నాగేశ్వరరావు 1958లో జన్మించారు. ఇండస్ట్రీయలిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన టీడీపీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తన తండ్రి పేరుతో నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి సేవ చేస్తున్నారు. 2004లో ఖమ్మం ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో టీడీపీ తరఫున బరిలో నిలిచి గెలుపొందారు. 2014లో ఓడిపోయిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుండి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరి ఖమ్మం ఎంపీగా పోటీచేస్తున్నారు.

- Advertisement -